https://oktelugu.com/

AP CM Jagan – Yellow Media : కాన్ఫిడెంట్ గా సీఎం జగన్.. కన్ఫ్యూజన్ లో ఆ మీడియా

వైసీపీ, బీజేపీ మధ్య గ్యాప్ నిజమా? కాదా? అని నిర్ధారించుకోలేకపోతోంది. అనుమానపు చూపులు చూస్తోంది. మరికొన్నిరోజులు ఆగి తమ పల్లకి రాజకీయాలను ప్రారంభించాలని వ్యూహం రూపొందించుకుంది.

Written By:
  • Dharma
  • , Updated On : June 15, 2023 11:34 am
    Follow us on

    AP CM Jagan – Yellow Media : గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ సీఎం జగన్ లో ఒక రకమైన కాన్ఫిడెండ్ కనిపిస్తోంది. సభలు, సమావేశాల్లో ఎటువంటి బెరుకు, ఆందోళన కనిపించడం లేదు. రాజకీయ ప్రత్యర్థులపై తనదైన పంచులతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా బీజేపీ అగ్రనేతల వైఖరి మారిన తరువాత జగన్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అయితే ఆయన ఓ సెక్షన్ మీడియాను నైరాశ్యంలో నెట్టేస్తున్నారు. దుష్టచతుష్టయంతో పాటు బీజేపీని జగన్ ఒకే గాటిన కట్టడంతో ఆ మీడియాకు ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదు. బీజేపీ అగ్రనేతలు జగన్ సర్కారుపై అవినీతి ఆరోపణలు చేయడం, దానికి జగన్ బీజేపీని లైట్ తీసుకోవడంతో ఆ మీడియా మల్లగుల్లాలు పడుతోంది.

    జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఆ మీడియా హడావుడి అంతా ఇంతా కాదు. ఢిల్లీ పెద్దలు జగన్ ను పట్టించుకోవడం లేదని.. పక్కన పడేశారని చూపే ప్రయత్నం చేశారు. అగ్రనేతలు కోపంగా ఉన్నారని రాసుకొచ్చేవారు. గత నాలుగేళ్లుగా పదే పదే ఇదే రాతలు కనిపించేవి. జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిసేవారు. ఇలా కలిసే క్రమంలో ఏకాంతంగా మాట్లాడేవారు. ప్రాథమిక స్థాయి వివరాలను మాత్రమే ట్విట్టర్ ద్వారా బయటకు తెలిపే వారు. కానీ ఆ మీడియా మాత్రం అక్కడే కార్యాలయంలో ఉన్నట్టు కల్పిత రాతలు రాసేది. తాము అభిమానించి, పల్లకి మోసే రాజకీయ పార్టీలకు ఆనందినిచ్చేవి.

    అదే చంద్రబాబు ఢిల్లీ వెళితే ఆ కథనాల తీరే వేరు. ఎక్కడో జీ20 సన్నాహాక సమావేశాలకు చంద్రబాబు హాజరైతే… మోదీ పక్కకు తీసుకెళ్లి మరీ మాట్లాడారని.. సీఎం జగన్ వైపు కూడా చూడలేదని రాసుకొచ్చారు. ఎలా ఉన్నారు? అప్పుడప్పుడు ఢిల్లీ వచ్చి కలువచ్చు కదా అని చంద్రబాబు భుజంపై చేయి వేసి మోదీ కుశల ప్రశ్నలు అడిగేవారని వెగటు రాతలు సైతం రాసేవారు. జగన్ కలిసి కేంద్రం నుంచి సానుకూల నిర్ణయాలు వచ్చినప్పుడు మాత్రం తప్పుడు రాతలకు పనిచెప్పేవారు. అదే ప్రజాస్వామ్య విరుద్ధ నిర్ణయాలు అంటూ చూపే ప్రయత్నం చేసేవారు. చంద్రబాబు హయాంలో రావాల్సిన నిధులు, బకాయిలంటూ బుకాయించేందుకు ప్రయత్నించేవారు. వైసీపీ, బీజేపీ ఒక్కటే అని అర్ధం వచ్చేలా మాట్లాడేవారు.

    అయితే ఇప్పుడు టీడీపీ రూట్లోకి బీజేపీ వస్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. ఏపీ పర్యటనకు వచ్చిన అగ్రనేతలు అమిత్ షా, నడ్డాలు జగన్ సర్కారుపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అవినీతి ప్రభుత్వం అంటూ విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన జగన్ నిండు సభలో దుష్టచతుష్టయంతో పాటు బీజేపీ చేరిందని.. తాను ఒంటరిగానే పోరాటం చేస్తానని చెప్పారు. అయితే ఇది ప్రత్యర్థులకు అర్ధమైందో లేదో తెలియదు కానీ…ఆ సెక్షన్ ఆఫ్ మీడియా మాత్రం అయోమయానికి గురవుతోంది. వైసీపీ, బీజేపీ మధ్య గ్యాప్ నిజమా? కాదా? అని నిర్ధారించుకోలేకపోతోంది. అనుమానపు చూపులు చూస్తోంది. మరికొన్నిరోజులు ఆగి తమ పల్లకి రాజకీయాలను ప్రారంభించాలని వ్యూహం రూపొందించుకుంది.