CM Chandrababu: తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు తాజాగా తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తిరుమలలోని శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు తిరుమలకు తరలి వస్తుంటారు. తెలుగు రాష్ట్రాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చింది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం. అటువంటి ఆధ్యాత్మిక ధామంలో ప్రజా ప్రతినిధులకు పెద్దపీట వేస్తుంటారు. వారు ఇచ్చే సిఫార్సు లేఖలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసులకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ క్రమంలో ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించిన తెలంగాణ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఇటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్టుగా టీటీడీ తన నిర్ణయాలను వెల్లడించింది.
* వారంలో నాలుగు దర్శనాలకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలను వెల్లడించింది. వారంలో నాలుగు సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారంలో రెండు బ్రేక్ దర్శనాలు, రెండు రూ.300 టికెట్ల దర్శనాలకు సంబంధించి అవకాశం ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది టీటీడీ. తెలంగాణ ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
* హర్షాతిరేకాలు
తెలంగాణ ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు టీటీడీ ట్రస్ట్ బోర్డు తాజా నిర్ణయం పై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై తెలంగాణ ప్రజాప్రతినిధులతో పాటు రాజకీయ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కూటమి సర్కార్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత తమ విషయంలో ప్రత్యేక పరిగణగా తీసుకుని.. స్వామివారి దర్శనాల విషయంలో తమ సిఫారసు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ప్రజా ప్రతినిధులు కోరుతూ వచ్చారు. కానీ ఎట్టకేలకు కూటమి సర్కార్ సానుకూల నిర్ణయం తీసుకోవడం పై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.