Chandrababu Naidu orders: తెలుగుదేశం( Telugu Desam) అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్ధులు ట్రాప్ చేయడం అనేది కామన్ గా మారింది. చంద్రబాబు అనని మాట అన్నట్టు.. ఆయన పేరిట అనేక రకాల దుష్ప్రచారాలు చేసేవారు. ముఖ్యంగా 2014 నుంచి 2019 మధ్య ఆయన పాలనలో బిజీగా ఉండగా.. పొలిటికల్ గా ఎంతలా డ్యామేజ్ చేయాలో అంతలా చేశారు. అంతటి అనుభవం ఉన్న నేతకు సైతం ముచ్చెమటలు పట్టించారు. అప్పట్లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేలా చేశారు. అంతలా నడిచింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ వ్యవహారం. ఇప్పుడు మరోసారి అటువంటి ట్రాప్ జరుగుతోందన్న అనుమానం ఉంది. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఇది స్పష్టమవుతోంది. అయితే గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు రంగంలోకి దిగారు సీఎం చంద్రబాబు. గత పరిణామాలను గుర్తుచేస్తూ పార్టీ శ్రేణులకు స్పష్టమైన సూచనలు చేశారు.
గత రెండు రోజుల పరిణామాలపై..
అంబటి రాంబాబు( ambati Rambabu) వ్యాఖ్యలు, జోగి రమేష్ కామెంట్స్.. తరువాత వారి ఇళ్లపై టిడిపి శ్రేణుల దాడులు.. ఇలా ఒక రకమైన వాతావరణం నెలకొంది ఏపీలో. అయితే దీని వెనుక పక్కా వ్యూహం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే కూటమి దాదాపు రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి ఉంది. అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పెట్టుబడులు వస్తున్నాయి. సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఓవరాల్ గా ప్రభుత్వంపై ఒక సంతృప్తికర ముద్ర ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వాన్ని ఇబ్బందులు తెచ్చి పెట్టేలా ఉన్నాయి. అందుకే నేరుగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అధినేత హితబోధ..
అయితే ఈ విధ్వంసాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక రకమైన గందరగోళాన్ని క్రియేట్ చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. అధికారం కోల్పోయామని అసహనంతోనే రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి రెచ్చగొడుతోందని.. టిడిపి మంత్రులతో పాటు సీనియర్ నేతలకు సూచించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ” పెట్టుబడులు సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది మన ప్రధాన అజెండా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అభివృద్ధి నచ్చట్లేదు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించి తీరుతాం. వైయస్సార్ కాంగ్రెస్ నేతలు అలజడి సృష్టించేందుకే బూతులు మాట్లాడుతున్నారు. వైయస్సార్సీపీ హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై పుట్టింది. ఆ పార్టీ ట్రాప్ లో పడితే.. వారికీ, మనకి తేడా ఉండదు. టిడిపి కార్యకర్తలు సంయమనం పాటించాలి. కార్యకర్తలు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. పార్టీ నేతలు పరిస్థితిని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి” అంటూ సూచించారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా ఇంతటి వివాదానికి కారణమైన నెయ్యి కల్తీ వ్యవహారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. అంతకుముందు చంద్రబాబు సంచలన ట్వీట్ చేశారు. ” నారమయ్య రాజకీయాలు వైఎస్సార్సీపీ సిద్ధాంతం. వారి హయాంలో జరిగిన చట్ట విరుద్ధ పాలనే దీనికి నిదర్శనం. 2024 తర్వాత రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు అవుతోంది. ప్రజలకు సేవ చేయడం వారికి సాధికారత కల్పించడం మా సిద్ధాంతం. వైఎస్ఆర్సిపి నిజస్వరూపం బయటపడుతున్న కొద్ది అసహనంతో దూషణలకు దిగుతున్నారు. వాళ్లు విధ్వంసం చేసిన వ్యవస్థలు పునర్నిర్మానం జరుగుతున్న తీరును చూసి ఓర్వలేకపోతున్నారు. రాజ్యాంగమే సుప్రీం. మేం నెలకొల్పిన శాంతిభద్రతలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడి తీరుతాం. చట్ట ఉల్లంఘనలకు ఎవరిని అనుమతించేది లేదు ” అని ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు.