Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: సీఐఐ మీటింగ్ : విధ్వంస ఏపీగా ఎలా మారింది.. చంద్రబాబు తీసుకున్న నిర్ణయమేంటి?

CM Chandrababu: సీఐఐ మీటింగ్ : విధ్వంస ఏపీగా ఎలా మారింది.. చంద్రబాబు తీసుకున్న నిర్ణయమేంటి?

CM Chandrababu: విశాఖపట్నం : విధ్వంసమైన ఏపీని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్భాటాలకు దూరంగా ఉంటూ.. పాలనలో ముందుకు సాగుతున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతి విషయాల్లో తనదైన మార్కులు వేస్తున్న చంద్రబాబు.. రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి పైన తన లక్ష్యాన్ని చాటుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో సహకారం అందించాలని కేంద్రాన్ని కోరారు. ఇటీవల ఢిల్లీలో పర్యటించి కేంద్ర పెద్దల ఎదుట కీలక ప్రతిపాదనలు పెట్టారు. వారి నుంచి సానుకూలత రావడంతో ఒక్కో రంగాన్ని పట్టాలెక్కించే పనిలో పడ్డారు.

ముఖ్యంగా పారిశ్రామిక రంగంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు చంద్రబాబు. అందుకే పెద్ద ఎత్తున పరిశ్రమలను రప్పించేందుకు తనవంతు ప్రయత్నాలను ప్రారంభించారు. ఇప్పటికే దేశీయ, స్వదేశీ పారిశ్రామిక దిగ్గజాలు చంద్రబాబును కలుస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తమ సంసిద్ధతను ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో గురువారం కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ‘సీఐఐ’ నేషనల్ కౌన్సిల్ సభ్యుల సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఉండగా అనకాపల్లి మెడ్ టెక్ జోన్ నుంచి మాట్లాడారు. కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కోరారు. భూముల కేటాయింపు తో పాటు రాయితీ కల్పిస్తామని హామీ ఇచ్చారు.విశాఖను ఫిన్ టెక్ హబ్ గా తీర్చిదిద్దుతామని కూడా చెప్పుకొచ్చారు. బి 4 విధానంలో భాగస్వామ్యం కావాలని కూడా పిలుపునిచ్చారు.

టిడిపి ఈసారి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయ నిర్ణయాల్లో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు పథకాలను ప్రకటించారు.అయితే ఈ సంక్షేమ పథకాలు పేదరికాన్ని పారదోలేదుగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు చంద్రబాబు. ఇందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని కూడా కోరారు. గతంలోని ఆర్థిక సంస్కరణల తర్వాత ఇప్పుడు పి4 మోడల్ ను పబ్లిక్, ప్రైవేట్,ప్రజల భాగస్వామ్యంతో తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. సూక్ష్మ, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. పేదరికం లేని దేశాన్ని ఎలా నిర్మించాలో ఆలోచిద్దాం అంటూ ఆయన పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన పిలుపు ఆకట్టుకుంది.

గతంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు చంద్రబాబు. ఈ క్రమంలో ప్రజల నుంచి వ్యతిరేకత కూడా అదే స్థాయిలో వ్యక్తం అయింది. ఆందోళనలో భాగంగా జరిగిన కాల్పుల్లో మనుషులు చనిపోయిన సందర్భాలు కూడా ఎదురయ్యాయి. రాజకీయంగా కూడా చాలా నష్టం జరిగింది చంద్రబాబుకు. కానీ చంద్రబాబు ప్రవేశపెట్టిన సంస్కరణలే జాతీయస్థాయిలో అమలుకు నోచుకున్న విషయం అందరికీ తెలిసిందే. అదే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. దేశంలోనే తొలిసారిగా రెగ్యులేటరీ కమిషన్ ను ఏర్పాటు చేసిన వైనాన్ని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో అధునాతన పద్ధతులు తీసుకురావాలన్నదే తన ధ్యేయమని చంద్రబాబు ప్రకటించారు. ఎప్పటికీ అధునాతన వ్యవసాయ పద్ధతులు, డ్రోన్ సాంకేతికత రైతుల దరి చేరలేదన్నారు. ప్రస్తుతం తన మనసంతా వ్యవసాయ రంగంపై ఉందని.. వ్యవసాయ రంగానికి సంబంధించి పెట్టుబడులు పెట్టాలని కూడా ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. నైపుణ్య గణనతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఏపీ యువత అందిపుచ్చుకోవచ్చు అని కూడా చెప్పుకొచ్చారు. ఆటోమొబైల్స్, హార్డ్వేర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా, అగ్రి ప్రాసెసింగ్ లో అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం హైలెట్ గా నిలిచింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version