CM Chandrababu ex PS :పెండ్యాల శ్రీనివాస్… ఈ పేరు గుర్తుంది కదూ. అదేనండీ సీఎం చంద్రబాబు మాజీ పిఎస్. వైసిపి ప్రభుత్వం ఈయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు ఎత్తేసింది. టిడిపి అధికారంలోకి రాగానే తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పెండ్యాల శ్రీనివాస్ కోరారు. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం విశేషం. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో పెండ్యాల శ్రీనివాస్ సైతం కీలక భాగస్వామి అని సిఐడి కేసు నమోదు చేసింది. ఆయనపై అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేయడంతో అప్పట్లో పెండ్యాల శ్రీనివాస్ పేరు మార్మోగిపోయింది. ఈయనకు సైతం అప్పట్లో నోటీసులు జారీ అయ్యాయి. కానీ పెండ్యాల విచారణకు హాజరు కాలేదు. అమెరికా పారిపోయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయన విధులకు హాజరు తప్పనిసరి. కానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పెండ్యాల శ్రీనివాస్ కోర్టు విచారణకు హాజరు కాలేదు. నోటీసులు ఇచ్చిన అనంతరం ఆయనపై 2023 సెప్టెంబర్ 30న ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
* ఆయనే కీలకం
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు సంబంధిత కంపెనీల ప్రతినిధులకు మధ్య వారధిగా పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారని సిఐడి చెప్పుకొచ్చింది. అదే అనుమానం వ్యక్తం చేస్తూ ఆయనపై కేసు నమోదు చేసింది. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెండ్యాల శ్రీనివాస్ టార్గెట్ అయ్యారు. 2020 ఫిబ్రవరి 6న పెండ్యాల ఇంట్లో సోదాలు కూడా జరిగాయి. సుమారు 2000 కోట్ల లావాదేవీలకు సంబంధించి కీలక సాక్షాలను సేకరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
* అప్పట్లో విదేశాలకు
పెండ్యాల శ్రీనివాస్ అమెరికా వెళ్లారని.. అరెస్టులకు భయపడి విదేశాలకు వెళ్లిపోయారని.. ఆయన తిరిగి వస్తే చంద్రబాబు కేసులో మరింతగా ఇరుక్కోవడం ఖాయమని అప్పట్లో ప్రచారం నడిచింది. అదే సమయంలో పెండ్యాల శ్రీనివాస్ అమెరికా వెళ్లిపోయినట్లు కూడా టాక్ నడిచింది. కానీ ధ్రువీకరిస్తూ ఎటువంటి ఆధారాలు బయట పెట్టకపోవడం విశేషం. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే పెండ్యాల శ్రీనివాస్ కేసుల్లో ఇరుక్కోవడం ఖాయమని కామెంట్స్ వినిపించాయి.
* ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
అయితే ఏపీలో వైసీపీ సర్కార్ దిగిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెండ్యాల విదేశాల నుంచి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తిరిగి ఉద్యోగ విధుల్లో చేరుతానని ఆయన కోరడం.. కూటమి ప్రభుత్వం సమ్మతించడంతో ఆయనకు లైన్ క్లియర్ అయింది. అయితే గతంలో మాదిరిగా చంద్రబాబు పిఎస్ గా చేరుతారో? లేకుంటే తన మాతృ శాఖలో విధులు నిర్వహిస్తారో చూడాలి.