CM Chandrababu: ఆ యువకుడి ఫోటో ఆరాటం.. చంద్రబాబు చేసిన పనికి అంతా ఫిదా!

పుట్టుకతోనే ఆ యువకుడు దివ్యాంగుడు. ఆపై దీర్ఘకాలిక వ్యాధిబారిన పడ్డాడు.చంద్రబాబుపై విపరీతంగా అభిమానం పెంచుకున్నాడు. జీవితంలో ఒకసారైనా ఆయనతో ఫోటో దిగాలని భావించాడు. అది తెలిసిన చంద్రబాబు చలించి పోయారు. నేరుగా తన అభిమాని వద్దకు వెళ్లి కోరిక తీర్చారు.

Written By: Dharma, Updated On : October 6, 2024 11:52 am

CM Chandrababu(4)

Follow us on

CM Chandrababu: గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. గతంలో పాలన, విజనరీ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేవారు చంద్రబాబు. అప్పట్లో తనను కలిసేందుకు ఆసక్తి చూపేవారికి కూడా టైం ఇచ్చేవారు కాదు.సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కూడా కఠినంగా ఉండేవారు.కానీ ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తనను అభిమానించే వారి విషయంలో అదే అభిమానాన్ని కనబరుస్తున్నారు. పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజల విన్నపాలను కూడా అక్కడికక్కడే తీర్చుకున్నారు. తాజాగా చంద్రబాబు చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. క్యాన్సర్ తో పోరాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అభిమాని చివరి కోరికను తీర్చిఅందరి మన్ననలు అందుకున్నారు.తన జీవితంలో ఒక్కసారి అయినా చంద్రబాబుతో కలిసి ఫోటో దిగాలన్న కోరికను తీర్చారు. అభిమానిలో సంతోషాన్ని నింపారు. చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన 30 ఏళ్ల సురేంద్రబాబు పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతున్నారు. చంద్రబాబుకు వీరాభిమాని. జీవితంలో ఒక్కసారి అయినా చంద్రబాబుతో ఫోటో దిగాలన్నది ఆయన కోరిక. అయితే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న సురేంద్రబాబు పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని ఆశ్రయించారు. ఆయన ఆ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చంద్రబాబు తిరుమల పర్యటనలో ఉన్న నేపథ్యంలో.. తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయంలో సురేంద్రబాబును కలుస్తానని హామీ ఇచ్చారు.ఆ విషయాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

* అభిమానించే నేతను చూసి..
తిరుమల పర్యటనను ముగించుకొని రేణిగుంట విమానాశ్రయం గేటు వద్దకు వచ్చిన చంద్రబాబు సురేంద్రబాబును కలుసుకున్నారు. వాహనం దిగి తన వద్దకు నడుచుకుంటూ వస్తున్న చంద్రబాబును చూసి ఆనందంతో పరవశించిపోయాడు సురేంద్రబాబు. తాను ఎంతో అభిమానించి.. ఆరాధించే సీఎం చంద్రబాబు స్వయంగా తన వద్దకు నడుచుకుంటూ వస్తున్న వైనంతో సురేంద్రబాబు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతడి తల్లిదండ్రుల సైతం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సురేంద్రబాబు కోరుకున్నట్టే అతనితో ఫోటో దిగారు చంద్రబాబు. అంతటితో ఆగకుండా వైద్య చికిత్సల నిమిత్తం ఐదు లక్షల రూపాయలను అందించారు. ఏ అవసరం ఉన్న తన దృష్టికి తీసుకురావాలని స్థానిక నేతలకు ఆదేశించారు చంద్రబాబు.

* మారిన మనిషి
అయితే ఈ ఒక్క ఘటనే కాదు. చాలా సందర్భాల్లో చంద్రబాబు చూపిన చొరవ మారిన మనిషిని తలపిస్తోంది. గతంలో సామాన్యులు చంద్రబాబును కలిసేందుకు వీలుపడేది కాదు. అటువంటిది సామాన్యులు, పార్టీ కార్యకర్తలు సైతం చంద్రబాబుకు కలిసే అవకాశం కల్పిస్తున్నారు. సామాన్య దివ్యాంగుడి విషయంలో చంద్రబాబు చూపిన చొరవ అభినందనలు అందుకుంటోంది. సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారుతోంది.