CM Chandrababu (5)
CM Chandrababu: చంద్రబాబుకు, ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు స్నేహం ఈనాటిది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాత ఆంధ్రజ్యోతి పత్రికలో వేమూరి రాధాకృష్ణ టిడిపి బీట్ చూసేవారు. అప్పట్లో చంద్రబాబుతో అతనికి సఖ్యత ఉండేది. కాలక్రమంలో అది మరింత పెరిగింది. కొంతకాలానికి ఆంధ్రజ్యోతి మూతపడటం.. దానిని రాధాకృష్ణ కొనుగోలు చేయడం.. 23 సంవత్సరాలుగా విజయవంతంగా దాని నడపడం వంటివి జరిగిపోతున్నాయి. ఆంధ్రజ్యోతిలో మొదటి నుంచి చంద్రబాబుకు అనుకూలమైన వార్తలే వస్తుంటాయి. ఇది ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులే చెబుతుంటారు. టిడిపి నేతలు కూడా ఆంధ్రజ్యోతిని తమ సొంత పత్రికగా పేర్కొంటుంటారు. ఆంధ్రజ్యోతి పత్రికకు భారీగానే యాడ్స్ ఇస్తూ ఉంటారు. 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఆధ్వర్యంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. టిడిపి ఆధ్వర్యంలోని కూటమి అధికారంలోకి రావడానికి ఆంధ్రజ్యోతి కూడా ఒక ముఖ్య కారణం. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలపాటు ఆంధ్రజ్యోతి టీడీపీకి మించి ప్రతిపక్ష పాత్రను పోషించింది. ఈనాడు పత్రికకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది గాని.. ఆంధ్రజ్యోతికి ఒక యాడ్ కూడా ఇవ్వలేదు. పైగా అనేక సందర్భాల్లో ఆంధ్రజ్యోతిని తనకు ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేవారు. జగన్మోహన్ రెడ్డిపై ఐదు సంవత్సరాల పాటు పుంఖాను పుంఖాలుగా వ్యతిరేక వార్తలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి.. ఇప్పుడు చంద్రబాబుపై కూడా అదే ధోరణి కొనసాగిస్తుందేమోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి..
Also Read: ఉద్యోగుల బకాయిలు క్లియర్.. విశ్వాసాన్ని పెంచుకున్న చంద్రబాబు!
ఇటీవల వేమూరి రాధాకృష్ణ జిల్లాల్లో పర్యటించారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆయన జిల్లాల్లో పర్యటించడం ఒక రకంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో పర్యటిస్తున్నప్పుడు వేమూరి రాధాకృష్ణ తన సంస్థలో పనిచేస్తున్న పాత్రికేయులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ.. వన్ సైడ్ వార్తలు ప్రచురించకూడదని.. ఆధారాలు ఉంటే నెగిటివ్ వార్తలు కూడా ప్రచురించాలని ఆదేశాలు ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సహజంగా ఇలాంటి వార్తలను సాక్షి ప్రచురించాలి. కానీ సాక్షి కంటే ముందు ఆంధ్ర జ్యోతి ఇలాంటి వార్తలను ప్రచురించడం విశేషం. అబద్ధ టిడిపి ఎమ్మెల్యేలపై నెగటివ్ వార్తలను ప్రచురించిన ఆంధ్రజ్యోతి.. ఇటీవల టిడిపి ఎమ్మెల్యే ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించిన తీరును ప్రధానంగా ఎండగట్టింది. అంతేకాదు మద్యం అమ్మకాలకు సంబంధించి కూడా మంగళవారం ఏపీ ఎడిషన్ లో..” మద్యం అమ్మకాల్లో దోచేస్తున్నారు” అనే శీర్షిక వార్త కథనాన్ని ప్రచురించింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం వైన్ షాప్ ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇందులో మెజారిటీ వైన్ షాపులను టిడిపి నేతలు దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర జ్యోతిలో వైన్ షాపుల యజమానుల దోపిడీపై కథనం రావడం నిజంగా ఆశ్చర్యకరమే. అయితే ఇందులో ఏదైనా మతలబు ఉందా.. లేక చంద్రబాబుతో రాధాకృష్ణకు చెడిందా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.