Tirupati: పవిత్ర దేవస్థానాల్లో కొందరు చేస్తున్న అతి వివాదాస్పదంగా మారుతుంది. ఇటీవల ఆలయ ప్రాంగణాల్లో రీల్స్ చేయడం, ప్రసాదాలు కలుషితం అయ్యాయి అంటూ ప్రచారం చేయడం పరిపాటిగా మారింది. మొన్నటికి మొన్న ద్రాక్షారామంలో( draksharamam ) శివలింగాన్ని ధ్వంసం చేశాడు ఓ ఆగంతుకుడు. ఆ ఘటన మరువక ముందే తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఆలయంలో ఏకాంత సేవా అనంతరం మూసివేసిన తర్వాత లోపలికి ప్రవేశించాడు. మద్యం మత్తులో ఆలయంలోకి వెళ్లి విజిలెన్స్ సిబ్బంది కళ్ళుగప్పి మహా ద్వారం లోపలికి ప్రవేశించాడు. ఆలయ గోపురం పై ఎక్కి నినాదాలు చేశాడు. వెంటనే గమనించిన విజిలెన్స్ సిబ్బందితో పాటు తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. అతి కష్టం మీద అతన్ని కిందకు దించి పోలీస్ స్టేషన్కు తరలించారు.
* మానసిక స్థితి బాగా లేక..
తెలంగాణలోని నిజామాబాద్( Nizamabad) జిల్లాకు చెందిన తిరుపతి ఆలయ దర్శనానికి వచ్చాడు. అయితే పూటుగా మద్యం సేవించిన ఆయన మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు. గోవిందరాజు స్వామి ఆలయం పైకి ఎక్కి తనకు మద్యం బాటిల్ ఇస్తేనే కిందికి దిగుతానని చెప్పాడు. విజిలెన్స్, పోలీస్, ఫైర్ సిబ్బంది ఎంత బతిమలాడినా కిందకు దిగలేదు. చివరకు ఫైర్ సిబ్బంది సాహసం చేసి నిచ్చెనలతో పైకి వెళ్లి.. తాళ్లతో బంధించి బలవంతంగా కిందకు దించారు. దీంతో గోవిందరాజు స్వామి ఆలయం దగ్గర కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఆలయం పై ఉన్న కలశాలను కూడా లాగేందుకు సదరు వ్యక్తి ప్రయత్నించాడు. సీసీ కెమెరాలు తనిఖీ చేసి తిరుపతి ఎలా లోపలికి ప్రవేశించాడు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఘటనతో విజిలెన్స్ వైఫల్యం మరోసారి బయటపడింది.
* పెరుగుతున్న భక్తుల రద్దీ..
తిరుమలలో ( Tirumala) భక్తుల రద్దీ పెరుగుతోంది. మరోవైపు సంక్రాంతి సెలవులు సమీపిస్తుండడంతో ఈ రద్దీ మరింత పెరగనుంది. అందుకు తగ్గట్టు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. గోవిందరాజస్వామి వారి ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. దివ్యాంగ భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వుడెన్ రాంప్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. మరుగుదొడ్లను మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. అయితే గోవిందరాజస్వామి ఆలయ గోపురం పై ఆగంతకుడు ప్రవేశించడం పై మాత్రం ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇటువంటి వాటి విషయంలో సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. విజిలెన్స్ వైఫల్యం పై పూర్తిస్థాయి సమీక్ష చేపట్టాల్సిన అవసరం ఉంది.