CI Shankaraiah dismissed: వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి.. నిందితులకు కొమ్ముకాసారన్న ఆరోపణల నేపథ్యంలో ఓ పోలీస్ అధికారి సర్వీసును తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసు విచారణ పూర్తయింది. కానీ మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని కోరుతూ వివేక కుమార్తె సునీత సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశిస్తే మళ్ళీ మొదటి నుంచి విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వైసిపి హయాంలో సిబిఐ దర్యాప్తురన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కేసు విచారణ చేపట్టిన సిఐ సైతం సాక్షాలను చెరిపేసారని అనుమానిస్తున్నారు. అయితే సదరు సీఐ మరింత దూకుడుగా ముందుకు అడుగులు వేశారు. రాజకీయ ప్రాద్బలంతో ఏకంగా సీఎం చంద్రబాబుకు పరువు నష్టం నోటీసులు పంపించారు. అయితే ఇప్పుడు పోలీస్ శాఖ సదరు సిఐ పై చర్యలకు ఉపక్రమించింది.
ఆరేళ్ల కిందట ఘటన..
2019 మార్చి 15న వైయస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. తొలుత ఆత్మహత్యగా చిత్రీకరించారు. తరువాత హత్యగా పోలీస్ శాఖ ధ్రువీకరించింది. అయితే అప్పట్లో పులివెందుల సిఐ గా శంకరయ్య ఉండేవారు. అప్పటి టిడిపి ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించగా.. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం సిబిఐ దర్యాప్తునకు పట్టుపట్టారు. అప్పట్లో ప్రభుత్వం సిఐగా ఉన్న శంకరయ్య పై సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పాటు సాక్షాలను చెరిపేసారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై తరువాత చంద్రబాబు మాట్లాడుతూ సిఐ తీరును తప్పుపట్టారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐ శంకరయ్యకు పోస్టింగ్ వచ్చింది. వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సిబిఐ సీఐ శంకరయ్య వాంగ్మూలం కూడా తీసుకుంది. ప్రస్తుతం ఆ శంకరయ్య పోలీస్ శాఖలో విఆర్ లో ఉన్నారు.
ఏకంగా చంద్రబాబు కు నోటీసు..
అయితే ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐ శంకరయ్య నేరుగా సీఎం చంద్రబాబుకు పరువు నష్టం నోటీసులు పంపించారు. తన పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరించినందుకుగాను.. కోటి 45 లక్షలకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే దీనిపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. రాజకీయ ప్రోద్భలంతోనే శంకరయ్య ఈ నోటీసులు పంపించారని పోలీస్ శాఖ విచారణలో తేలింది. ప్రస్తుతం వీఆర్ లో ఉన్న శంకరయ్యను ఏకంగా సర్వీసు నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇది ఒక ఆసక్తికర పరిణామమే.