Kasibugga Temple Latest News: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో మరో ఘటన జరిగింది. రెండు నెలల కిందట జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిరుపేదలకు తిరుమల తరహాలో శ్రీవారి దర్శనం కల్పించాలన్న లక్ష్యంతో ధర్మకర్త ముకుంద పండా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒకేసారి వేలాదిమంది భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు చనిపోయారు. అయితే ప్రభుత్వం ఆలయాన్ని తాత్కాలికంగా మూసి వేయించింది. త్రిసభ్య కమిటీని నియమించింది విచారణకు. ఆ కమిటీ కొన్ని సూచనలు చేసింది. భక్తుల సౌకర్యార్థం కొన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే భక్తుల సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే ఇటువంటి సమయంలో ఆలయంలో భారీ చోరీ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.
భద్రతాపరమైన పనులు..
గత కొద్ది రోజులుగా ఆలయంలో భద్రతాపరమైన పనులు జరుగుతున్నాయి. పోలీసుల బందోబస్తు కూడా కొనసాగుతోంది. ఆలయంలో భారీ చోరీ జరిగింది. దేవాలయం వెనుక ద్వారా నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. బంగారంతో పాటు వెండి నగలు చోరీ చేసినట్లు గుర్తించారు. ఆలయ ధర్మకర్త హరి ముకుంద పండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీకి గురైన సొత్తు 60 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. వరుసగా దేవాలయంలో జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
భారీగా భక్తులు తరలి రావడంతో..
నవంబర్ 1న ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఆరోజు పవిత్ర కార్తీక ఏకాదశి. దీంతో ఒక్కసారిగా భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూ లైన్ లో తొక్కిసలాట జరిగింది. ఆలయ ధర్మకర్త హరి ముకుంద పండా తన సొంత డబ్బులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. గత ఏడాది మే నెలలో ఆలయ ప్రారంభం జరిగింది. అక్కడినుంచి భక్తుల సందర్శన ప్రారంభమైంది. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 12 ఎకరాల 40 సెంట్లు భూమిలో ఈ ఆలయం నిర్మితం అయింది. కేవలం భక్తి భావంతోనే ఏర్పాటు చేశారు హరి ముకుందా పండ. ఒకవైపు తొక్కిసలాట ఘటన జరిగింది. భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తూ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే ఇప్పుడు చోరీ జరగడం సంచలనంగా మారింది.