Chiranjeevi Vs Balakrishna: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీస్తున్నాయి. అదే సమయంలో చిరంజీవి చేసిన ప్రకటన కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు చూస్తే తన సోదరుడు చిరంజీవి.. మరోవైపు చూస్తే కూటమిలో కీలక ఎమ్మెల్యే బాలకృష్ణ… ఇలా ఇద్దరి వ్యాఖ్యల మధ్య పవన్ స్పందన ఏంటనేది ఇప్పుడు అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వివాదాన్ని జఠిలం చేసి లాభం పొందాలని చూస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఎక్కడ చిరంజీవిని తక్కువ చేసి మాట్లాడలేదు బాలకృష్ణ. బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పు పట్టలేదు చిరంజీవి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపై అదేపనిగా వ్యతిరేక ప్రచారం చేస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ వచ్చి దీనికి చెక్ చెబుతారా? ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
* వివరణ ఇచ్చే ప్రయత్నం..
అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్( Kamineni Srinivas ) సినీ ప్రముఖులు గట్టిగా అడిగితేనే అప్పట్లో జగన్ స్పందించారని.. అవమానం జరిగిందని అనేసరికి.. బాలకృష్ణ ఒక్కసారిగా స్పందించారు. ఆవేశంగా మాట్లాడుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినీ ప్రముఖులకు అవమానం జరిగిందన్నమాట వాస్తవమేనని.. కానీ చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ వచ్చి కలిసారన్నది అబద్ధమని వ్యాఖ్యానించారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని ఎవరు గట్టిగా అడగలేకపోయారని అన్నారు. ఇండస్ట్రీ పెద్దలు కలవడానికి వెళ్ళినప్పుడు.. ముఖ్యమంత్రి కలవరు. సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడుతారని చెబితే.. అప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితే.. అప్పటి సీఎం దిగివచ్చి కలిసారన్నది అబద్ధం. దానిని ఖండిస్తున్నాను.. అంటూ తీవ్రస్థాయిలో మాట్లాడారు బాలయ్య. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు సినీ రంగ ప్రముఖులతో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన జాబితాలో తన పేరును తొమ్మిదో స్థానంలో వేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు అలా వేసారని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను బాలయ్య అడిగారు. ఇదే నా వ్యక్తులకు ఇచ్చే గౌరవం? అంటూ మండిపడ్డారు.
* కేవలం అప్పటి పరిణామాలపై..
అయితే బాలకృష్ణ నోటి నుంచి చిరంజీవి ప్రస్తావన వచ్చేసరికి.. మెగాస్టార్ స్పందించాల్సి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో సినిమా టిక్కెట్ల ధర పెంపు కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ప్రకటన ఒకటి విడుదల చేశారు. అప్పట్లో తెలుగు సినీ ప్రముఖులు కొంతమంది తన వద్దకు వచ్చారని.. సినిమా టికెట్ల ధరల పెంపు కోసం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలని కోరారని.. అప్పట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నానితో మాట్లాడానని చిరంజీవి తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే బాలకృష్ణ ను సంప్రదించేందుకు ఫోన్లో ప్రయత్నించానని.. కానీ ఆయన అందుబాటులోకి రాలేదని చిరంజీవి చెబుతున్నారు. నిర్మాత జెమినీ కిరణ్ కూడా ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయారని తెలిపారు. దీంతో ఆర్ నారాయణ మూర్తితో సహా కొందరు సినీ ప్రముఖులతో కలిసి జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు తెలిపారు. సినీ పరిశ్రమ కు సహకారం అందించాలని కోరినట్లు వివరించారు. అప్పట్లో తాను తీసుకున్న చొరవతోనే ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపునకు అంగీకారం తెలిపిందని.. ఆ నిర్ణయంతోనే వీర సింహారెడ్డి తో పాటు వాల్తేరు వీరయ్య వంటి సినిమాలకు కూడా టిక్కెట్ల ధరలు పెరగడానికి దోహదపడ్డాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున ఈ ప్రకటన ద్వారా వాస్తవాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నానని చిరంజీవి ముగించారు.
* ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోలే..
అయితే శాసనసభలో బాలకృష్ణ( Balakrishna) కామెంట్స్.. చిరంజీవి ప్రకటన చూస్తే మాత్రం ఇద్దరి మధ్య వాదనలు జరిగాయన్నది అబద్ధం. ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణం ఉందన్న రీతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. శాసనసభలో నాటి ముఖ్యమంత్రి జగన్ ను సినీ ప్రముఖులు కలిసే సమయంలో జరిగిన పరిణామాలపై మాత్రమే చర్చ జరిగింది. చిరంజీవికి నాడు అవమానం జరిగిందని బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రస్తావించారు. కానీ దానికి కౌంటర్ గా బాలకృష్ణ నాటి సంగతులను గుర్తు చేశారు. తాజాగా సీఎం చంద్రబాబును కలిసేందుకు వెళుతున్న జాబితాలో తన పేరు చివరిలో పెట్టారని మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేశారు బాలయ్య. అందులో ఎక్కడా నేరుగా చిరంజీవి పై బాలయ్య ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ నేరుగా బాలకృష్ణ చిరంజీవి పై వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో చిరంజీవి సైతం నాటి ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో జరిగిన పరిణామాలనే తన ప్రకటనలు ప్రస్తావించారు. అయితే ఇద్దరి మాటల మధ్య.. ఇప్పుడు పవన్ ఎలా స్పందిస్తారు అనేది చర్చ. కచ్చితంగా దీనిని పవన్ కళ్యాణ్ చాలా సులువుగా తేల్చి పారేస్తారని అభిమానులు భావిస్తున్నారు. పవన్ స్పందన ఎలా ఉండబోతుందో చూడాలి.