Ram Gopal Varma : జీవితం మనకు ఎన్నో ఇస్తుంది. ఎన్నెన్నో అవకాశాలు కల్పిస్తుంది. వాటిని అందిపుచ్చుకోవాలి కానీ.. వాటిని తలకెక్కించుకొని మాట్లాడితే అచ్చం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( cine director Ram Gopal Varma ) మాదిరిగా ఉంటుంది. దర్శకత్వ ప్రతిభతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేజీని దక్కించుకున్నారు రాంగోపాల్ వర్మ. కానీ ప్రతిభకు మించి తప్పిదాలకు వ్యసనపరుడుగా మారిపోయారు. తనలో ఉన్న ప్రతిభను దాటి వెళ్లిపోయింది ఆయనలో ఉన్న చెడ్డతనం. పెద్దవారు అంటే లెక్కలేని తనం.. ప్రతిభ, నైపుణ్యం ఉన్న వారిని చూసి ఎగతాళిగా మాట్లాడడం, వెటకారం చేయడం వంటి వాటితో అపఖ్యాతిని మూటగట్టుకున్నారు రామ్ గోపాల్ వర్మ. కెరీర్ పాతాళంలోకి పడిపోవడంతో ఇప్పుడు అసలు విషయం తెలిసింది. తాను ఎంత ప్రతిభ కలిగిన దర్శకుడినో.. తానే గుర్తుకు తెచ్చుకునేలా పరిస్థితులు వచ్చాయి.
* ప్రతిభను కొనియాడిన చిరంజీవి
తాజాగా నాగార్జున నటించిన శివ ( Shiva) సినిమా రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఆ యూనిట్కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు అందించారు. సినిమా గొప్పతనాన్ని చెప్పే క్రమంలో రామ్ గోపాల్ వర్మ ప్రతిభను అభినందించారు మెగాస్టార్ చిరంజీవి. కానీ అదే మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుటుంబాన్ని ఎన్నో రకాలుగా కించపరిచారు రాంగోపాల్ వర్మ. కానీ వాటన్నింటినీ మనసులో పెట్టుకోకుండా చిరంజీవి మాట్లాడారు. అయితే చిరంజీవి మెచ్చుకున్నది రామ్ గోపాల్ వర్మ లో ఉన్న దర్శకత్వ ప్రతిభను. ఆయన ఏ స్థాయిలో సూటిపూటి మాటలు అన్నారో చిరంజీవికి తెలుసు. కానీ చిరంజీవి హుందాతనం పాటించారు. రాంగోపాల్ వర్మ కు అభినందనలు తెలిపారు. ఒక విధంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వ ప్రతిభను గుర్తుచేసినట్టే. ఎలాంటి రాంగోపాల్ వర్మ ఎలా అయిపోయాడు అని చర్చకు వచ్చేలా చిరంజీవి వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన దర్శకత్వ ప్రతిభను పొగడడం ద్వారా.. ఆయన ఏం పోగొట్టుకున్నారో అన్నది గుర్తు చేయగలిగారు మెగాస్టార్ చిరంజీవి.
* మెగా కుటుంబం పట్ల అనుచిత ప్రవర్తన..
గతంలో మెగాస్టార్ చిరంజీవితో( megastar Chiranjeevi) పాటు ఆ కుటుంబం పట్ల రామ్ గోపాల్ వర్మ హేళనగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. రాంగోపాల్ వర్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న వేళ.. మెగా కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడారు రాంగోపాల్ వర్మ. నోటికి ఎంత వస్తే అంత మాటలు అనేవారు. రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలపై మెగా అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. నాగబాబు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యే వారు కూడా. మెగా కుటుంబంతో సినిమాలు ఒప్పుకొని మధ్యలో వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి రామ్ గోపాల్ వర్మ వల్ల. అయితే తనతో పాటు తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ ప్రతిభను అభినందించి.. గొప్ప మనిషిగా చిరంజీవి నిలిచారు. అయితే తాను ఎంత దిగజారిపోయానో అన్నది రాంగోపాల్ వర్మ కు గుర్తు చేశారు.