Chiranjeevi: దేశంలో రెండో అత్యున్నత పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఒక నటుడుగా తెలుగు రాష్ట్రాలకు ఇదో అరుదైన గౌరవం. అయితేఎన్నికల ముంగిట అవార్డును అందుకున్న చిరంజీవికి ఏపీ సీఎం జగన్ కనీసం శుభాకాంక్షలు తెలపకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల చిరంజీవి కూటమికి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఆ తరువాత కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబు లకు మద్దతు తెలిపారు. పిఠాపురంలో పవన్ ను గెలిపించాలని ప్రత్యేక వీడియో విడుదల చేశారు. మరోవైపు రేపు పిఠాపురంలో పవన్ కు మద్దతుగా రోడ్ షోలో పాల్గొంటారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు చిరంజీవి.
తెలుగు రాజకీయ, సినీ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు.’ తన సినిమాల ద్వారా, మానవతా సేవలు ద్వారా ప్రజల జీవితాలను స్పృశించిన ప్రముఖ నటుడు చిరంజీవి. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. మార్గదర్శక ప్రయత్నాలు, సామాజిక సేవల కోసం విస్తృతంగా పనిచేశారు’.. అంటూ ఎక్స్ లో ప్రత్యేకంగా పోస్ట్ చేశారు. చిరంజీవి పద్మ విభూషణ్ అందుకోవడం పై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ట్విట్ చేశారు.’ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారి చేతుల మీదుగా భారతదేశంలో రెండో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు. లక్ష్యాల పట్ల గట్టి సంకల్పంతో, క్రమశిక్షణతో కృషి చేస్తే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించిన చిరంజీవి గారిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి ‘ అంటూ చంద్రబాబు ట్విట్ చేశారు. టిడిపి యువ నేత నారా లోకేష్ సైతం చిరంజీవికి అభినందనలు తెలిపారు. ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.’ మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది తెలుగు వారు గర్వించే సందర్భం. నాతో సహా కోట్లాదిమంది అభిమానులు ఆనందించే సమయం ‘ అని తెలిపారు.
ఒక తెలుగు నటుడికి రెండో అత్యున్నత పురస్కారం లభించినా, రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నా.. సీఎం జగన్ స్పందించకపోవడం చర్చకు దారి తీస్తోంది. ఒకానొక సమయంలో చిరంజీవి పట్ల జగన్ చూపించిన అభిమానం అంతా అంతా కాదు. చిరంజీవి మూడు రాజధానులకు మద్దతు తెలిపినప్పుడు, సినీ రంగ సమస్యలు విన్నవించినప్పుడు.. జగన్ చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తారు. పవన్ కంటే తనను ఎక్కువగా చిరంజీవి అభిమానిస్తారని చెప్పుకొచ్చారు. చిరంజీవి అంటే తనకు ఎనలేని గౌరవమని కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు అదే మెగాస్టార్ పద్మ విభూషణ్ అవార్డు అందుకుంటే కనీసం శుభాకాంక్షలు తెలపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలతోనే మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలపలేదని తెలుస్తోంది. మరోవైపు చిరంజీవికి సినీ పరిశ్రమల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.