Chintakayala Vijay Strong Warning: తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబానికి ప్రత్యేక స్థానం. ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా.. ప్రత్యర్థులు అనేక రూపాల్లో ఇబ్బందులు పెట్టినా అయ్యన్నపాత్రుడు కుటుంబం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తెలుగుదేశం పార్టీకి వీర విధేయత చూపింది ఆ కుటుంబం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఎవరికి భయపడని నైజం అయ్యన్నపాత్రుడు ది. ఆయన కుమారుడు విజయ్ సైతం అదే రీతిలో ఉంటారు. తెలుగుదేశం పార్టీ విషయంలో చాలా బాధ్యుడిగా ఉంటారు. తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఎదురైన ఇబ్బందులు, కేసులు, ఉక్కు పాదాలను గుర్తుచేస్తూ సొంత పార్టీ శ్రేణులకు గట్టి హెచ్చరికలే పంపారు విజయ్. ఒకానొక దశలో సహనం కోల్పోయి సొంత పార్టీ కార్యకర్తలపై పౌరుష వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పార్టీతో ప్రత్యేక అనుబంధం..
తెలుగుదేశం పార్టీలో అయ్యన్నపాత్రుడు( ayyana Pathrudu) తర్వాత ఆయన కుమారుడు విజయ్ దూకుడుగా ఉంటున్నారు. అయ్యన్నపాత్రుడు రాజ్యాంగబద్ధ పదవి స్పీకర్ గా మారడంతో రాజకీయ కార్యకలాపాలన్నీ విజయ్ చూస్తున్నారు. ఒక విధంగా అనకాపల్లి జిల్లా పార్టీ బాధ్యతలు విజయ్ చేతుల్లోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గ బాధ్యతలు ఆయన చూస్తున్నారు. అయితే తాజాగా ఓ సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి.
స్ట్రాంగ్ వార్నింగ్..
కొంతమంది టిడిపి నేతలు వైసిపి నేతలతో చేతులు కలుపుతున్నారని అర్థం వచ్చేలా విజయ్( Vijay) వ్యాఖ్యానాలు సాగాయి. సిగ్గు లజ్జ లేకుండా వైసిపి వాళ్లతో మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం ఉంటే వైసిపి వారితో మాట్లాడకూడదని తేల్చి చెప్పారు. గతంలో పక్క పార్టీ వారితో మాట్లాడే వారమని.. వారి పెళ్లిళ్లు, వేడుకలకు వెళ్లే వారమని గుర్తు చేశారు. అయితే ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశారని గుర్తు చేశారు. వైసీపీ నేతలు మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఎఫ్ ఐ ఆర్ లు వేశారు, కేసులు పెట్టారు. ఆడవారిని సైతం రోడ్డుపైకి లాగారు. అలాంటి వారితో ఎలా మాట్లాడుతారు. నాకు అన్నీ తెలుస్తున్నాయి. ఇంకోసారి అలా మాట్లాడిన వారిని ఒంగోపెట్టి తన్నేస్తా అంటూ స్ట్రాంగ్ విమర్శలు చేశారు. మీ అందరికీ ఒకే మాట చెబుతున్నాను అంటూ.. నిజంగా మగతనంతో రాజకీయం చేయాలి. రాజకీయాల కోసం అన్ని మరిచిపోతారా? నాకు అన్నీ తెలుస్తున్నాయి. ఎవడెవడు మాట్లాడుతున్నాడు. ఆ ఊరు పోయినా.. పంచాయితీ పోయినా పర్వాలేదు. ఒకటి మాత్రం చెబుతున్నాను.. వెన్నుపోటు పొడిచే వాడిని క్షమించేది లేదు. వెన్నుపోటు పొడిచే వాడు పేగులు తీసి రోడ్డుపై పడేస్తా. నా రక్తసంబంధీకులు ఎవరైనా పర్వాలేదు అంటూ హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం వైసీపీ వారితో సంబంధాలు పెట్టుకోవద్దంటూ గట్టి హెచ్చరికలే పంపారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.