Sajjala Ramakrishna Reddy: వైసీపీలో సజ్జలకు ప్రాధాన్యం తగ్గిందా? కేవలం ఆయన నిమిత్తమాత్రుడేనా? ఆయన స్థానంలోకి వేరొకరు వచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఎక్కడో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. పార్టీలో ప్రాధాన్యం పెంచుకుంటూ ముందుకు సాగారు. వైసిపి అధికారంలోకి రావడంతో ప్రభుత్వంలోనూ తనదైన పాత్ర పోషించారు. తనకు తాను జగన్ వీర విధేయుడునని ప్రమోట్ చేసుకున్నారు. అధినేతకు చాలా దగ్గరయ్యారు. అత్యంత ఆత్మీయుడిగా మారిపోయారు. ఎంతలా అంటే అప్పటివరకు పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డిని సైతం డామినేట్ చేసేలా సీన్ క్రియేట్ చేశారు. క్రమేపి పార్టీతో పాటు ప్రభుత్వంలో పట్టు పెంచుకున్నారు. కుమారుడు సజ్జల భార్గవరెడ్డిని పార్టీలో కీలక విభాగమైన సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించుకున్నారు. గత ఐదేళ్లుగా మకుటం లేని మహారాజుగా ఎదిగారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కూడా ఆయనే కారణమని సొంత పార్టీ శ్రేణులు ఆరోపించేదాకా పరిస్థితి వచ్చింది. వైసీపీకి ఓటమి తరువాత కూడా ఆయనపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. కానీ జగన్ ఇవేవీ పట్టించుకోలేదు. ఏకంగా వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త పదవిని ఆయనకు అప్పగించారు. దీంతో పార్టీలో మరోసారి సజ్జలకు తిరుగు లేదని అంతా భావించారు. అయితే అది కేవలం ప్రచారం మాత్రమేనని.. లోలోపల పార్టీ నియామకాలన్నీ మరో నేత సిఫార్సులతో జరుగుతున్నాయని తాజాగా తెలుస్తోంది.
* సజ్జల సిఫారసులు కావట
ఇటీవల నియోజకవర్గ బాధ్యులతో పాటు అధికార ప్రతినిధులు, ఇతరత్రా నియామకాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇవన్నీ సజ్జల సిఫారసులతోనే జరుగుతున్నట్లు అంతా భావించారు. కానీ అది నిజం కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ కోటరీలో చేరిన కొత్త నేత సిఫారసులకు పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా వైసీపీ అంటే జగన్, విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నట్టు పరిస్థితి ఉండేది. కానీ అనూహ్యంగా ఒక పేరు తెరపైకి వచ్చింది. ఆయనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎన్నికలకు ముందు కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి బాధ్యతలు అప్పగించిన భాస్కర్ రెడ్డి జగన్ చెంతకు చేరారు. సీఎంఓలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సజ్జలను పక్కనపెట్టి చెవిరెడ్డి అధినేత వద్ద పలుకుబడి సంపాదించినట్లు సమాచారం.
* విధేయ నేతగా మారిన భాస్కర్ రెడ్డి
చంద్రగిరి నియోజకవర్గం నుంచి గత రెండు ఎన్నికల్లో గెలిచారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ ఎన్నికల్లో మాత్రం ముందుగానే తప్పుకున్నారు. కుమారుడు మోహిత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించి జగన్ కోటరీలో చేరారు. ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డిని సైడ్ చేసి ఎక్కడ సెట్ అయ్యారు. అక్కడ ఉంటూనే జగన్ కు అత్యంత విధేయనేతగా మారిపోయారు. ఇప్పటికే సర్వే సంస్థల పేరుతో హల్ చల్ చేసిన భాస్కర్ రెడ్డి జగన్ కు మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు సజ్జలను కాదని భాస్కర్ రెడ్డికి ప్రాధాన్యం ఇస్తున్నారు జగన్. గత కొద్ది రోజులుగా వైసీపీలో జరుగుతున్న నియామకాల వెనుక భాస్కర్ రెడ్డి సిఫార్సులు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే వైసీపీలో సజ్జలకు తెరవెనుక టెండర్ పెడుతున్నారు భాస్కర్ రెడ్డి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి.