Uppada: గోదావరి జిల్లాలో( Godavari district) మత్స్యకారులు ఆందోళనతో ఉన్నారు. ముఖ్యంగా కాకినాడ ఉప్పాడ తీరంలో రసాయన వ్యర్థాలతో మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోందని.. మత్స్య సంపద అంతరించి పోతుందనే భయంతో పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టారు. రహదారులను దిగ్బంధించారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి లక్ష యాభై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కలుగజేసుకొని వారి ఆందోళనను విరమింప చేశారు. అయితే గోదావరి జిల్లాలో ఇలా మత్స్యకారులు రహదారుల పైకి రావడం ఆందోళన కలిగించింది.
* అంతరించిపోతున్న మత్స్య సంపద..
ఉప్పాడ( Uppada ) నుంచి అద్దరిపేట వరకు సముద్ర తీర ప్రాంతం విస్తరించి ఉంది. గతంలో అపారమైన మత్స్య సంపద చిక్కేది. కానీ ఇప్పుడు ఆశించిన స్థాయిలో చేపలు వలలు చిక్కడం లేదు. ఒకప్పుడు రాత్రి వేటకు వెళ్లి తెల్లారేసరికి వలలో కుప్పలు కుప్పలుగా చేపలు పడేవి. ఇప్పుడు చేపలు చిక్కకపోవడంతో మత్స్యకారులు ఉపాధికి దూరమయ్యారు. అయితే దీనంతటికీ కారణం తీరంలో ఉన్న రసాయన పరిశ్రమలేనని తెలుస్తోంది. భారీ ఔషధ తయారీ పరిశ్రమలు, ల్యాబ్లు తీర ప్రాంతంలో ఉన్నాయి. అవి విడిచి పెట్టే వ్యర్ధాలతోనే సముద్రంలో నీటి రంగు మారిపోతోందని.. అందుకే చేపలు వలలకు చిక్కడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు వలలో పడిన చేపలతో తమ కుటుంబాలు సుఖంగా జీవించేవని.. ఇప్పుడు ఉపాధి లేక అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు.
* డిప్యూటీ సీఎం స్పందన..
అయితే తీర ప్రాంతం వెంబడి మత్స్యకారులు ఇప్పుడు రోడ్డు ఎక్కడంతో ఏదో ఉద్యమంలా మారే అవకాశం ఉంది. సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. సముద్రం విషం గా మారిందని.. మమ్మల్ని రక్షించేది ఎవరు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సమస్యపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సమస్యపై అధ్యయనానికి కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీస్, రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్ తో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంతో పాటు జీవనోపాధి మెరుగుదల, వీరప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఈ కమిటీ దృష్టి పెడుతుందని చెప్పారు. ఈ కమిటీ నివేదికల ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉప్పాడ మత్స్యకార కుటుంబాలు చేపట్టిన నిరసనలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి.