AP DSC: డీఎస్సీ నోటిఫికేషన్ ప్రమాదంలో పడింది. నిబంధనలకు విరుద్ధంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎలా ఇస్తారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. నోటిఫికేషన్ నిలుపదల చేయడానికి సైతం సిద్ధపడింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 6,100 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వడాన్ని తప్పుపడుతూ హైకోర్టులో ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఇచ్చారని పేర్కొన్నారు.
దీనిపై హైకోర్టులో ఈరోజు విచారణ సాగింది. అటు ఉభయ వర్గాలు తమ వాదనలు వినిపించాయి. ఎస్జీటీ పోస్టులకు బిఈడి అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల డిఎడ్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎన్సిఈటి నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్జిటి అభ్యర్థులు తక్కువగా ఉన్న కారణంగానే బిఈడి అభ్యర్థులను అనుమతించాల్సి వస్తోందని వాదించారు. అర్హత సాధించిన బీఈడీ అభ్యర్థులు బ్రిడ్జి కోర్స్ చేసిన తర్వాతే బోధనకు అనుమతిస్తామని చెప్పుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు బ్రిడ్జి కోర్స్ కి చట్టబద్ధత ఏముందని ప్రశ్నించింది. తక్షణం నోటిఫికేషన్ నిలుపుదలకు ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధపడింది. ప్రభుత్వ వివరణ తీసుకునేందుకు ఒక్కరోజు సమయం కావాలని ఏజీ కోర్టును అభ్యర్థించారు. దీంతో కేసు విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
మరోవైపు ఈనెల 23 నుంచి హాల్ టికెట్లు జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో డీఎస్సీ తో పాటు నిర్వహించేవారు. కానీ ఈ విధానానికి ప్రభుత్వం మంగళం పలికింది. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వస్తుందన్న సమయంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంపై నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు మెగా డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఆ విషయం మర్చిపోయారు. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముంగిట డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ కావాలనే నిబంధనలు పాటించలేదని.. న్యాయ చిక్కులకు అవకాశం ఇచ్చారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ భవితవ్యం ఏమిటన్నది రేపు తెలియనుంది.