Coastal Erosion In AP: ఏపీలో( Andhra Pradesh) సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి తిరుపతి జిల్లా తడ వరకు దాదాపు 1000 కిలోమీటర్ల పొడవునా తీరం ఉంది. అయితే ఎక్కడికక్కడే తీరం కోతకు గురవుతోంది. తీర ప్రాంత ప్రజలకు సముద్రపు కోత కన్నీటిని మిగిల్చుతోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతం కడలి కోతకు గురికాకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తీర ప్రాంత కోతకు అడ్డుకట్ట వేయడానికి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండల పరిధిలో ప్రయోగాత్మకంగా జియో ట్యూబు సాంకేతికతతో రక్షణ కూడా నిర్మిస్తోంది. తీరం కోతకు గురి కావడంతో తరచూ విపత్తులు సంభవించి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అందుకే కట్టిన చర్యలకు ఉపక్రమిస్తోంది ప్రభుత్వం.
జియో ట్యూబు విధానంతో..
సముద్ర కోతను అరికట్టడానికి ల్యాండ్ రిక్లమేషన్( land reclamation), నీటి నిర్వహణలో ఈ జియో ట్యూబ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ముఖ్యంగా సముద్రపు కోతకు అడ్డుకట్ట వేయడానికి.. 6 స్టేజీల్లో జియో ట్యూబ్ రక్షణ గోడ నిర్మాణం చేపడతారు.. ముందుగా జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన ట్యూబుల్లో ఇసుక నింపుతారు. వాటిని నిర్దేశించిన పొడవులో తీర ప్రాంతంలో గోడలా అమర్చుతున్నారు. ఈ జియో ట్యూబుకు ఇరువైపులా పాలి ప్రొఫైలీన్ జియో సింథటిక్ కార్డుతో చేసిన గాబియన్ బాక్సులు అమర్చుతారు. ఈ బాక్సుల్లో గ్రానైట్ రాళ్ళను నింపి.. వాటి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో ఇసుక పోస్తారు. అలల ఉధృతి, అక్కడి నేల స్వభావాన్ని అంచనా వేసి ఈ జియో ట్యూబ్ రక్షణ గోడను నిర్మిస్తున్నారు. సంప్రదాయ పద్ధతులు కంటే ఇది సులభమైనదిగా భావిస్తున్నారు. తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ టెక్నాలజీ తమిళనాడుతో పాటు ఒడిస్సాలో వినియోగించినట్లు తెలుస్తోంది.
* పెద్దమైనవాని లంకలో..
తీరంలో.. ప్రధానంగా పశ్చిమగోదావరి( West Godavari) పెద్ద మైనవానిలంక ప్రాంతంలో కోతకు గురవుతోంది. ఆ ప్రాంతంలో కోట్ల రూపాయల విలువైన సర్వి, కొబ్బరి తోటలు సముద్రంలో కలిసిపోతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు 2022లో కేంద్ర ప్రభుత్వం రక్షణ గోడ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే డెలైట్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల్లో భాగంగా రూ.13.50 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మద్రాస్ ఐఐటీ నిపుణులు డిజైన్స్, సూచనలు ఆధారంగా 2025 మేలో పనులు ప్రారంభం అయ్యాయి. పూనే కు చెందిన గార్వారి కంపెనీలు రక్షణ గోడ నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే నెలలో 70 శాతానికి పైగా పనులు పూర్తవుతాయని తెలుస్తోంది. మిగిలిన చోట్ల కూడా ఈ రక్షణ గోడల నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నట్లు సమాచారం.