YS Sharmila: ఏపీలో కూటమి అభ్యర్థులు మారుతారా? ఇప్పటికే ఖరారైన సీట్లలో మార్పు తప్పదా? కొందరికి సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉందా? కొన్ని నియోజకవర్గాల విషయంలో చేర్పులు మార్పులు తప్పవా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఎక్కడికక్కడే టిడిపి ఆశావహులు, టిక్కెట్లు దక్కని వారు చంద్రబాబును కలుస్తున్నారు. అనపర్తి నుంచి సీటు కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తాజాగా చంద్రబాబును కలిశారు. ఈ రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి అసంతృప్త నాయకులు చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. మరోవైపు జమ్మలమడుగు సీటు బిజెపికి వెళ్ళింది. అక్కడ మార్పు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలోను కూడా మార్పు తప్పదని తెలుస్తోంది.
కడప జిల్లాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. దీంతో కూటమి అభ్యర్థుల్లో సైతం మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇక్కడ వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. అటు టిడిపి అభ్యర్థిగా జమ్మలమడుగు నాయకుడు భూపేష్ రెడ్డి పేరును ఖరారు చేశారు. అయితే ఇప్పుడు కడప ఎంపీ సీటును బిజెపి అడుగుతోంది. మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది. పొత్తులో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించారు. బిజెపి హై కమాండ్ ఆదినారాయణ రెడ్డి పేరును ఖరారు చేసింది. అదే సమయంలో ఇన్నాళ్లు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న భూపేష్ రెడ్డిని కడప ఎంపీగా ప్రకటించారు. ఆదినారాయణ రెడ్డి స్వయాన అన్న కుమారుడే భూపేష్ రెడ్డి.
జమ్మలమడుగు నియోజకవర్గ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆదినారాయణ రెడ్డి విముఖతగా ఉన్నారు.అటు భూపేష్ రెడ్డి సైతం ఎంపీగా పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. అటు కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తుండడంతో సీన్ మారుతోంది. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి గౌరవప్రదమైన ఓట్లు సాధించారు. అయితే ఇప్పుడు వైయస్ కుటుంబంలో చీలిక రావడం, వివేకానంద రెడ్డి హత్య కేసు హైలెట్ కావడం, సోదరుడిపై షర్మిల పోటీకి దిగడం.. తదితర కారణాలతో వైయస్ కుటుంబ ఓట్లకు గండిపడే అవకాశం ఉంది. అదే జరిగితే ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి అయితే బాగుంటుందన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీతో పాటు బిజెపి నుంచి వినిపిస్తోంది.ఆదినారాయణ రెడ్డి కుటుంబం నుంచి సైతం ఇదే ప్రతిపాదన వస్తోంది. అదే జరిగితే పొత్తులో భాగంగా బిజెపికి దక్కిన పార్లమెంటు స్థానాలు ఏడుకు చేరుకుంటాయి. అదే సమయంలో టిడిపికి ఒక అసెంబ్లీ స్థానం పెరగనుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.