Chandrababu Vs YCP : ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మినీ మేనిఫెస్టో విషయంలో వైసీపీ అధినాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లను మరలా జరగకుండా టీడీపీ ఉచ్చులో పడకుండా జాగ్రత్తలు వహిస్తోంది. ఇప్పటికే అమలు చేస్తున్న ఉచితాలకు చంద్రబాబు కొత్త రంగు పులిమారంటూ విమర్శలు ఎక్కుపెట్టింది. తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలో పడేలా చేసేందుకు జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
గత టీడీపీ ప్రభుత్వం హయాంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేపట్టారు. అప్పుడు అన్ని వర్గాలకు అన్ని చేస్తామని హామీలిచ్చారు. జగన్ చేస్తున్న హామీల్లో కొన్నింటిని అప్పటికప్పుడు చంద్రబాబు చేసి చూపించారు. వైసీపీ చెబుతున్నవన్నీ తామే చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు డంబికాలు పోయారు. ఇది ఒకరకంగా అప్పట్లో జగన్ కే కలిసొచ్చింది. వైసీపీ చెబుతున్న పథకాలను చంద్రబాబు ఫాలో అవుతున్నారని ఎత్తిపొడిచారు. ఇక తమ ప్రభుత్వం వస్తే రామరాజ్యమేనని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు అప్పట్లో సామాజిక పింఛన్లను రూ.2000 చేస్తే, జగన్ విడతల వారీగా రూ.3,000 చేస్తామని అనాల్సి వచ్చింది. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల అమలుకే ప్రాధాన్యమిచ్చింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అడ్డదారుల్లో అప్పుల్లో చేసి మరీ ప్రజలకు పప్పుబెల్లాల్లా నగదును పంచిపెడుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు విడుదల చేసిన మినీ మేనిఫెస్టోపై ప్రజల్లో సానుకూలత కనిపిస్తోంది. ఉచితాలు కాకుండా అందుకు భిన్నంగా మేనిఫెస్టో ప్రకటన లేదని కొన్ని వర్గాలు విమర్శలు చేస్తున్నారు.
ఏదిఏమైనా వైసీపీ ప్రభుత్వం టీడీపీ మేనిఫెస్టో మాయలో పడినట్లు కనిపించడం లేదు. ఇప్పటికే తాము అమలు చేస్తున్న పథకాలకు మెరుగులు దిద్ది మినీ మేనిఫెస్టో విడుదల చేశారంటూ వైసీపీ నాయకులు అంటున్నారు. నిన్నా మొన్నటి వరకు అసంతృప్తితో రగిలిపోతున్న వారిని ఒకవైపు మంచి చేసుకునే పనిలో పడిన జగన్ ప్రభుత్వం, మరోవైపు టీడీపీపైనా విమర్శల దాడి ఎక్కువ చేసింది. మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించిన పథకాల జోలికి ప్రస్తుతం అయితే వెళ్లలేదు. ఆయన చెబుతున్న పథకాల్లో ఆమోదయోగ్యంగా ఉన్నవాటికి పేర్లు మార్పులు చేసి జగన్ తన మేనిఫెస్టోలో చేర్చుకునే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.