CM Chandrababu: ఏపీలో( Andhra Pradesh) పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోంటోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఏపీలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నాయి. ముఖ్యంగా విశాఖకు ఐటి సంస్థలు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు ఇటు నుంచి ప్రయత్నాలు జరుగుతుండగా.. ఇప్పుడు మరోసారి భారీ పరిశ్రమలు ఏపీకి తరలివచ్చే అరుదైన అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత దావోస్ సదస్సు రేపు ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు బయలుదేరి వెళ్ళనున్నారు. ఇందుకుగాను ప్రత్యేక బృందం ఆయన వెంట వెళ్ళనుంది. ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ఈ బృందం భేటీ కానుంది. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో పాటుగా రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ అవకాశాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకోనున్నారు కూడా. ఇప్పటికే మంచి టీమ్ ను సైతం సెలెక్ట్ చేసుకున్నారు బాబు.
* పెట్టుబడులే లక్ష్యం
ఏపీకి ( Andhra Pradesh)భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగనుంది. విజయవాడ నుంచి ఈ ప్రత్యేక టీం ముందుగా ఢిల్లీకి చేరుకోనుంది. అక్కడి నుంచి ఈరోజు అర్ధరాత్రి ఈ బృందం దావోస్ వెళ్ళనుంది. మూడు రోజులపాటు వరుస సమావేశాలతో చంద్రబాబు బిజీగా గడపనున్నారు. దావోస్ సదస్సులో ఏపీ పెవిలియన్ కొలువుతీరుతోంది. ఈ మూడు రోజుల్లో చంద్రబాబు కనీసం 30 మంది ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యేలా షెడ్యూల్ ఖరారు చేశారు. అందులో భాగంగా తొలి రోజు స్విట్జర్లాండ్ లోని భారత రాయబారితో సమావేశం అవుతారు. తరువాత హిల్టన్ హోటల్లో పదిమంది పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు చంద్రబాబు.
* వరుస సమావేశాలతో బిజీ
మరోవైపు స్విజర్లాండ్( Switzerland) లోని ప్రవాస ఆంధ్రులతో సైతం ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. అటు తరువాత పలువురు పారిశ్రామిక, వాణిజ్య వేత్తలతో సైతం వరుసగా సమావేశాలు అవుతారు. ఇక రెండో రోజు షెడ్యూల్ కు సంబంధించి సిఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై జరిగే చర్చలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. తరువాత సోలార్ ఇంపల్స్ కోకోకోలా, వెల్స్పన్, ఎల్జీ, క్లార్స్ బర్గ్, సిస్కో, వాల్ మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు చంద్రబాబు. యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బీన్ తో చర్చలు జరుపుతారు. అనంతరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే ఎనర్జీ ట్రాన్స్మిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేటు గోల్స్ అనే అంశంపై చర్చల్లో పాల్గొంటారు.
* మూడు రోజుల పాటే హాజరు
వాస్తవానికి ఐదు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుంది. కానీ చంద్రబాబు( Chandrababu) మాత్రం మూడు రోజులపాటు సదస్సులో పాల్గొనున్నారు. నాలుగో రోజు దావోస్ నుంచి జ్యూరీచ్ కు చేరుకోనున్నారు బాబు. అక్కడి నుంచి నేరుగా ఏపీకి చేరుకోనున్నారు. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దావోస్ సదస్సులకు హాజరయ్యారు చంద్రబాబు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో మరోసారి సీఎం హోదాలో దావోస్ లో పర్యటిస్తున్నారు. చంద్రబాబు బృందంలో నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఇతర అధికారులు ఉండనున్నారు.