CM Chandrababu(1)
CM Chandrababu: చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వైసీపీ నుంచి చేరికల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్థానిక పార్టీ శ్రేణుల అభ్యంతరాలను సైతం పరిగణలోకి తీసుకుంటున్నారు. వారిని ఒప్పించి వైసిపి నేతల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈరోజు మాజీ మంత్రి ఆళ్ల నాని టిడిపిలో చేరనున్నారు. వాస్తవానికి ఆయన చేరికపై పార్టీ శ్రేణుల నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. కానీ చివరకు వారు సైతం హై కమాండ్ నిర్ణయమే శిరోధార్యం అంటూ ప్రకటన చేశారు. అంటే చంద్రబాబు తెర వెనుక భారీ స్కెచ్ తో ఉన్నట్లు అర్థమవుతోంది. రెండు వ్యూహాలతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. వైసీపీలో బలమైన నాయకులు లేకుండా చేయాలని ఒక వ్యూహం. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజనతో.. రాష్ట్రవ్యాప్తంగా 50 నియోజకవర్గాలు పెరుగుతాయి. అంటే 225 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను తయారు చేయాలన్న మాట. అందుకే వైసిపి నేతలను పెద్ద ఎత్తున చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
* గతంలో కూడా
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో సైతం చంద్రబాబు వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహించారు. కానీ ఆ సమయంలో వలస నేతలతో విభేదాలపర్వం పతాక స్థాయికి చేరింది. అదే ఓటమికి కారణమైంది. అయితే అప్పుడు కూడా చంద్రబాబు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని భావించారు. రాష్ట్ర విభజనతో తప్పకుండా పునర్విభజన జరుగుతుందని అంచనాకు వచ్చారు. కానీ అలా జరగలేదు. దీంతో టీడీపీలోని పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కొరవడింది. ఆ ప్రభావం పార్టీ పై పడింది. ప్రతికూల ఫలితాలు వచ్చాయి.
* అర్ధబలం, అంగ బలం ఉన్న వారే
వైసీపీలో అంగ బలం, అర్థబలం ఉన్న నేతలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసింది కూడా వారే. వైసిపి నుంచి బయటకు వస్తున్న నేతలు ఆర్థికంగా బలమైన వారే. ఆళ్ల నాని బలమైన సామాజిక వర్గం నేత. ఆపై అంగ బలం ఉంది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు. ఆర్థికంగా బలమైన నేత. గ్రంధి శ్రీనివాస్. మంచి వ్యాపార కుటుంబం. ఇలా బలమైన నేతలని టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు. 2026 లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని చంద్రబాబుకు సమాచారం ఉంది. ఆ సమాచారంతోనే వైసీపీ నేతలను ఆకర్షిస్తున్నారు చంద్రబాబు. జగన్ బలాన్ని, బలగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. టిడిపి బలం పెంచుకుంటున్నారు. మరి చంద్రబాబు వ్యూహం ఎలా పనిచేస్తుందో తెలియాలి.