Chandrababu
Chandrababu: సుదీర్ఘ విరామం తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ ప్రక్రియ పూర్తయ్యాక.. సాయంత్రం నాలుగు గంటల సమయంలో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు. అప్పటికే టిడిపి శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. జై చంద్రబాబు నినాదంతో ఆ ప్రాంగణం మార్మోగింది. ఆ అభిమానాన్ని చూసి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అయినా అదుపు చేసుకొని ముందుకు సాగారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూప లేదు.
అయితే తన కోసం వచ్చిన టిడిపి శ్రేణులకు ఒక సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తనపై ఇంతటి అభిమానాన్ని చూపిన ప్రజలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని చంద్రబాబు చెప్పుకొచ్చారు.మద్దతుగా నిలిచిన ప్రపంచంలోనే తెలుగు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Chandrababu
చంద్రబాబు ప్రసంగం సాగిందిలా.. ” తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు. అభినందనలు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా నాకోసం రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడే సంఘీభావం తెలిపారు. పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మీరు చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. సంఘీభావం తెలపడంతో.. నేను చేసిన అభివృద్ధిని కూడా మీరు వివరించారు. నా జీవితం ధన్యమైంది. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడికి రాదు. 45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. చేయనివ్వను “.. నాకు మద్దతుగా నిలిచిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంటూ చంద్రబాబు ప్రసంగించారు. ఎటువంటి విమర్శలు, రాజకీయ అంశాలు లేకుండానే చంద్రబాబు ప్రసంగం సాగడం విశేషం.