Galla Jayadev : ఒక్కోసారి రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడతాయి.చాలా రకాల అవకాశాలను దూరం చేస్తాయి. అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ అధినేత, మాజీ ఎంపీ గల్లా జయదేవ్. ఎన్నికలకు ముందు ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు.అప్పటి వైసీపీ ప్రభుత్వ విధానాలు, కక్షపూరిత రాజకీయాల మూలంగా రాజకీయ సన్యాసం ప్రకటించారు.తన కంపెనీలు, కార్మికుల భవిష్యత్తు గురించి ఆలోచించి ఎన్నికల్లో పోటీ నుంచి వెనక్కి తగ్గారు. అయితే ఈ ఎన్నికల్లో టిడిపి గెలుస్తుందన్న నమ్మకం లేక గల్లా జయదేవ్ పోటీకి విముఖత చూపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడుఅదే గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీగా పోటీ చేసి గెలవడం, కేంద్రమంత్రి కావడంతో గల్లా జయదేవ్ కు షాక్ తగిలినట్లు అయింది. ఈసారి గుంటూరు నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచి ఉంటే గల్లా జయదేవ్ కేంద్ర మంత్రి కావడం ఖాయం. కానీ సరైన అంచనా వేయలేక పోటీకి దూరంగా జరిగారు జయదేవ్.అయితే ఆయనపై మంచి అభిప్రాయం ఉండడంతో చంద్రబాబు సముచిత స్థానం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. లేకుంటే రాజ్యసభ పదవిని ఆఫర్ చేస్తారని సమాచారం. కానీ ఏదో ఒక పదవి ఖాయం అని మాత్రం తెలుస్తోంది.
* వరుసగా రెండుసార్లు ఎంపీగా
2014లో టిడిపిలోకి వచ్చారు గల్లా జయదేవ్. అప్పటికే ఆయన తల్లి గల్లా అరుణకుమారి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. చంద్రబాబు పిలుపుమేరకు టిడిపిలో చేరారు. అయితే అనూహ్యంగా గల్లా జయదేవ్ కు గుంటూరు ఎంపీగా ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం నెగ్గుకొచ్చారు. అయితే ఈ ఎన్నికలకు ముందు పోటీ నుంచి తప్పుకున్నారు. ఇది తాత్కాలిక విరామమేనని.. త్వరలో మళ్లీ వస్తానని అప్పట్లోనే ప్రకటించారు.
* టిడిపి పార్లమెంటరీ పార్టీ నేతగా
2019 ఎన్నికల్లో ముగ్గురే గెలిచారు. టిడిపి పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్ వ్యవహరించారు. అమరావతి రాజధాని అంశంతో పాటు వైసిపి పాలనను పార్లమెంట్ వేదికగా ఎండగట్టారు జయదేవ్. దీంతో రాష్ట్రంలో వైసీపీకి టార్గెట్ అయ్యారు. అప్పట్లో ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు రావడంతో కేంద్ర పెద్దల దృష్టిలో సైతం జయదేవ్ పడ్డారు. దీంతో తన పరిశ్రమల నిర్వహణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పెట్టాయి. అందుకే రాజకీయాల నుంచి తాత్కాలికంగా నిష్క్రమించాలని భావించారు.
* రెండు పదవులు ఆఫర్
అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో సైతం కీలక భాగస్వామ్యం అయ్యింది. ఇటువంటి పరిస్థితుల్లో గుంటూరు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవి చేపట్టి ఉంటే జయదేవ్ పరిస్థితి మరోలా ఉండేది. అయితే జయదేవ్ విషయంలో చంద్రబాబు సానుకూలంగా ఉన్నారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఛాన్స్ ఇస్తారని టాక్ నడుస్తోంది. రాజ్యసభ పదవి ఆఫర్ ఉన్నట్లు కూడా సమాచారం. అయితే స్వతహాగా పారిశ్రామికవేత్త కావడంతో.. ఏపీకి పెట్టుబడులు రావడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి గానే చొరవ చూపవచ్చు. అందుకే ఢిల్లీలో ఏపీ ప్రతినిధిగా ఉండేందుకు ఇష్టపడినట్లు సమాచారం. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.