https://oktelugu.com/

Rajyasabha posts  : రాజ్యసభకు గల్లా జయదేవ్, నాగబాబు.. మోపిదేవి, బీదాకు అలా సర్దుబాటు!

ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరు రాజీనామా చేశారు. మరికొందరు అదే బాటలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

Written By: Dharma, Updated On : August 30, 2024 12:12 pm

Rajyasabha Posts

Follow us on

Rajyasabha posts : వైసీపీతో పాటు పదవులకు రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు . త్వరలో వారు టిడిపిలో చేరనున్నారు. అయితే టిడిపి వారికి రాజ్యసభ పదవులు ఇస్తుందా?లేక వేరే హామీ ఉందా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే వీలున్నంతవరకు కొత్తవారిని రాజ్యసభకు ఎంపిక చేస్తుందన్నది ఒక ప్రచారం ఉంది. బీదా మస్తాన్ రావు సుదీర్ఘకాలం టిడిపిలోనే కొనసాగారు. ఆయన టిడిపి మనిషే. కానీ వైసీపీ బలవంతంగా లాక్కుంది. రాజ్యసభ పదవి ఆఫర్ చేసింది. దీంతో పార్టీ మారాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అయితే ఇప్పుడు బీదా మస్తాన్ రావు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. మరోవైపు మోపిదేవి వెంకటరమణకు సైతం ఎమ్మెల్సీ ఆఫర్ ఉన్నట్లు సమాచారం. ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇవ్వడంతోనే టిడిపి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి స్థానంలో ఎవరిని నియమిస్తారు అన్నది ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తోంది.

* ఆశావహులు అధికం
టిడిపిలో రాజ్యసభ పదవుల ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల్లో చాలా మంది పోటీ చేయలేదు. కొందరు సీనియర్లకు సీట్లు దక్కలేదు. అటువంటి వారంతా పెద్దల సభలో పదవులు కోరుకుంటున్నారు. అయితే ఈసారి మాత్రం గల్లా జయదేవ్ కి చంద్రబాబు రాజ్యసభ పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. గత రెండుసార్లు గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు జయదేవ్. కానీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. అందుకే ఆయనకు చాన్స్ ఇస్తారని తెలుస్తోంది. మంచి వాగ్దాటి, జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న జయదేవ్ అయితే బాగుంటుందన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది.

* మెగా బ్రదర్ కు అవకాశం
ఇక మరో రాజ్యసభ సీటును మెగా బ్రదర్ నాగబాబుకి ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో జనసేనతో పాటు కూటమి గెలుపునకు నాగబాబు కృషి చేశారు. 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సొంతం చేసుకున్నారు. ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని భావించారు. పొత్తులో భాగంగా ఆ సీటును బిజెపికి కేటాయించడంతో సీఎం రమేష్ పోటీ చేశారు. పాత్తు ధర్మం కోసం ఆ సీటును త్యాగం చేశారు నాగబాబు. అప్పట్లోనే రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం నడిచింది. మధ్యలో టీటీడీ చైర్మన్ పోస్ట్ తో పాటుకార్పొరేషన్ పదవి ఆఫర్ చేసినా నాగబాబు తిరస్కరించారు. రాజ్యసభ పదవి కోసమే ఆయన నామినేటెడ్ పదవులను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

* కేంద్ర మంత్రి పదవి
నాగబాబుకు రాజ్యసభ పదవితో పాటు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందుకే టీటీడీ అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పినా నాగబాబు పెద్దగా ఆసక్తి చూపలేదు. అదే జరిగితే మెగా అభిమానులకు పండగే. మరోవైపుఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా గల్లా జయదేవ్ ను ఎంపిక చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఎంపీగా ఉండేందుకే జయదేవ్ ఇష్టపడుతున్నారు. మొత్తానికి అయితే ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా నేపథ్యంలో నాగబాబు, జయదేవ్ పెద్దల సభలో అడుగు పెట్టడం ఖాయమని తెలుస్తోంది.