https://oktelugu.com/

US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేల ట్విస్ట్‌.. కమలా హారిస్‌ పౌరసత్వ వివాదం.. ఏం జరగనుంది!?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం స్పీడ్‌ పెంచారు. ర్యాలీలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రజలకు హామీలు ఇస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 30, 2024 / 12:07 PM IST

    US Presidential Elections(1)

    Follow us on

    US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో జరుగనున్నాయి. ప్రధాన పోటీ అధికార డెమోక్రటిక్, విపక్ష రిపబ్లికన్‌ పార్టీల మధ్యనే నెలకొంది. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పోటీ చేస్తున్నారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ బరిలో ఉన్నారు. ఇప్పటికే ట్రంప్‌ పాలనను చూసిన అమెరికన్లు ఆయనపై విముఖంగానే ఉన్నారు. కానీ, ఇటీవల ఆయనపై జరిగిన కాల్పుల ఘటనతో సానుభూతి పెరిగింది. ఇదే సమయంలో ఆయన ఉచిత హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అధికార డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా మొదట అధ్యక్షుడు జో బైడెన్‌ ఉన్నారు. ఆయనను ఎన్నకునేందుకు కూడా అమెరిన్లు ఆసక్తి చూపలేదు. దీంతో ఆయన రేసులో వెనుకబడ్డారు. ఇది గమనించిన ఆయన అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ రేసులోకి వచ్చారు. కమలాను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె రేసులో దూసుకుపోతున్నారు. ప్రీపోల్‌ సర్వేల్లో ట్రంప్‌తో సమానంగా ఉన్నారు. అమెరికాలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుతున్న వేళ అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ అనర్హురాలంటూ సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. దీంతో, ఈసారి అధ్యక్ష ఎన్నికల మరింత రసవత్తరంగా మారింది.

    తెరపైకి మరో ట్విస్ట్‌..
    యూఎస్‌ నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రిపబ్లికన్‌ అసెంబ్లీస్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) అనే సంస్థ కమలా హారిస్‌ అనర్హురాలంటూ సరికొత్త ట్విస్ట్‌ను తెరపైకి తెచ్చింది. ‘సహజ పౌరసత్వం’ ఉన్నవాళ్లు మాత్రమే అధ్యక్ష పదవికి అర్హులని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందన్నది దాని వాదన. అమెరికా పౌరసత్వం ఉన్న దంపతులకు ఈ గడ్డపై పుట్టినవాళ్లను మాత్రమే సహజ పౌరులుగా రాజ్యంగం నిర్వచిస్తోంది. 1857 నాటి ప్రఖ్యాత డ్రెడ్‌ స్కాట్‌ వర్సెస్‌ స్టాన్ఫర్‌ కేసులో అమెరికా సుప్రీంకోర్టు తీర్పు కూడా దీన్ని ధ్రువీకరిస్తోంది. ఈ నిర్వచనం ప్రకారం హారిస్తో పాటు నిక్కీ హేలీ, వివేక్‌ రామస్వామి వంటివాళ్లు కూడా అధ్యక్ష పదవికి అనర్హులే అని ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ చెప్పుకొచ్చింది. ఈ కీలక మౌలిక ప్రాతిపదికను తుంగలో తొక్కుతూ డెమోక్రటిక్‌ పార్టీ హారిస్కు అధ్యక్ష అభ్యర్థిత్వం కట్టబెట్టిందని ఆరోపించింది.

    న్యాయ నిపుణుల వాదన ఇదీ..
    మరోవైపు.. న్యాయ నిపుణులు మాత్రం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ వాదనను కొట్టిపారేస్తున్నారు. రాజ్యంగానికి ఇది వక్రభాష్యమే అంటున్నారు. ఎన్‌ఎస్‌ఆర్‌ఎ ఉటంకిస్తున్న డ్రెడ్‌ స్కాట్‌ వర్సెస్‌ స్టాన్ఫర్‌ తీర్పు అమెరికా సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత చెత్త తీర్పుగా నిలిచిపోయిందని, తల్లిదండ్రులకు అమెరికా పౌరసత్వముందా, లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఈ గడ్డపై పుట్టే వారంతా దేశ పౌరులేనని ఆ తర్వాత సుప్రీంకోర్టు పలు తీర్పునిచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ వాదనను వర్తింపజేయాల్సి వస్తే బ్రిటిష్‌ మూలాలున్న తొలినాళ్ల అధ్యక్షులు జార్జి వాషింగ్టన్, జాన్‌ ఆడమ్స్, థామస్‌ జెఫర్సన్, జేమ్స్‌ మాడిసన్‌ కూడా ఆ పదవికి అనర్హులే అని పేర్కొంటున్నారు. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు పలికిన ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ హారిస్‌పై కావాలనే బురదజల్లుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హారిస్‌ తల్లి భారత్‌కు, తండ్రి జమైకాకు చెందిన వారన్నది తెలిసిందే.

    సుప్రీం కోర్టు తీర్పు ఇలా..
    డ్రెడ్‌ స్కాట్‌ వర్సెస్‌ స్టాన్ఫర్‌ కేసు 1857 నాటిది. అప్పట్లో అమెరికాలో పలు రాష్ట్రాల్లో బానిసత్వానికి చట్టబద్ధత ఉండేది. తనను స్వేచ్ఛా జీవిగా ప్రకటించాలంటూ డ్రెడ్‌ స్కాట్‌ అనే ఆఫ్రికన్‌ అమెరికన్‌ బానిస సుప్రీంకోర్టుకెక్కాడు. అందుకు కోర్టు నిరాకరించింది. పైగా ఆఫ్రికన్‌ అమెరికన్లు దేశ పౌరులే కాదు. కనుక వారికి సుప్రీంకోర్టుకెక్కే అర్హతే లేదు అని కోర్టు పేర్కొంది. పైగా దేశ అత్యున్నత చట్టసభ అయిన కాంగ్రెస్‌కు బానిసత్వాన్ని నిషేధించే అధికారం లేదంటూ తీర్పు వెలువరించింది. దీంతో అమెరికాలో బానిసత్వ రగడ తీవ్రతరమై అంతర్యుద్ధానికి దారితీసింది. ఆ తీర్చును పక్కన పెడుతూ అమెరికా రాజ్యాంగానికి 13, 14వ సవరణలు తీసుకొచ్చారు. బానిసత్వాన్ని రద్దు చేయడమే కాకుండా జాతి భేదాలతో నిమిత్తం లేకుండా అమెరికాలో పుట్టిన వాళ్లంతా దేశ పౌరులేనంటూ చట్టం చేశారు.