Chandrababu Arrested: తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు తొలిసారిగా అరెస్టయ్యారు. చాలా ప్రభుత్వాలు, రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబుపై కేసులు పెట్టారు. విచారణలు చేయించారు. విచారణ కమిటీలను సైతం వేశారు. కానీ అవేవీ చంద్రబాబుకు ఏమి చేయలేకపోయాయి. కేసులను, కమిటీలను ఉపసంహరించుకున్న ప్రభుత్వాలు సైతం ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు సడన్ గా స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును సిఐడి అరెస్టు చేయడం విశేషం.
అయితే ఈ కేసు విషయంలో సిఐడి పట్టు బిగిస్తుందా? ఆ పరిస్థితి ఉందా? అన్న అనుమానం కలుగుతోంది. చంద్రబాబు అరెస్టు సమయంలో సిఐడి అధికారులు నీళ్లు నమలడంతో ఒక రకమైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు సిఐడి వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తెలియడం లేదు. తన అరెస్టుకు సంబంధించి ఆధారాలు చూపించమని చంద్రబాబు పదేపదే డిమాండ్ చేయడం చూశాం. అయితే తాము ఇప్పటికే కోర్టుకు నివేదించామని సిఐడి స్పష్టం చేసింది. అయితే ఆధారాలు ఉన్నాయా? లేవా? సిఐడి అధికారులు నిబంధనల మేరకు అరెస్టు చేశారా? ఉల్లంఘించారా.. అన్నది పక్కన పెడితే ఇదో రాజకీయ సంచలనానికి దారితీస్తుందన్న అనుమానం కలుగుతోంది. కోర్టులో సహేతుకమైన కారణాలు చూపించకపోతే వైసీపీ సర్కార్ ఇరకాటంలో పడుతుంది. ఒకవేళ కానీ ప్రతికూల తీర్పు వస్తే చంద్రబాబు దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు.
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబు పై ఎన్నో రకాల అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే ఏ కేసులో కూడా చంద్రబాబును అరెస్టు చేయడానికి అవసరమైన ఆధారాలు లభించకపోవడం విశేషం. వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అవినీతిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. చాలా వరకు కేసులు నమోదు చేశారు. మంత్రివర్గ ఉప కమిటీలను సైతం నియమించారు. అయితే చంద్రబాబు కోర్టుకెళ్లి స్టేలు తెచ్చుకున్న కేసులు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి కనికరించి ఎత్తివేసిన కేసులు ఉన్నాయి. అటు లక్ష్మీపార్వతి లాంటి వాళ్లు ప్రైవేట్ కేసులు వేసినా పెద్దగా ప్రభావం చూపలేదు. వాటి నుంచి చంద్రబాబు తేలిగ్గానే బయటపడ్డారు.
అయితే గత నాలుగు దశాబ్దాలుగా ఓ మాజీ సీఎం అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. 1983 నుంచి తీసుకుంటే.. రాష్ట్రానికి ఎన్టీఆర్,కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రులుగా పని చేశారు. వారి హయాంలో అవినీతి ఆరోపణలు వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. వారు మాజీలుగా మారినా క్లీన్ ఇమేజ్ తో కొనసాగుతూ వచ్చారు. కానీ ఉమ్మడి రాష్ట్రానికి ఎక్కువ కాలం సీఎం బాధ్యతలు వహించిన చంద్రబాబు మాజీ గా మారిన తర్వాత అవినీతి కేసులో అరెస్ట్ కావడం మాయని మచ్చే.