Chandrababu: చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఒకవైపు పొత్తులపై రాజకీయం చేస్తూనే.. మరోవైపు వైసీపీ నుంచి చేరికలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇంకోవైపు సీట్లు దక్కని వారికి సముదాయిస్తూ శాంతింప చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కూటమిలోకి బిజెపి కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన విషయం విధితమే. అయితే బిజెపి వస్తుందా? లేదా? అన్నది క్లారిటీ లేదు. కానీ ఏకంగా 99 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన తేలిపోయింది. జనసేనకు మరో 19 స్థానాలు కేటాయించాల్సి ఉంది. మిగిలిన వాటిలో బిజెపికి ఎన్ని ఇస్తారు? అన్నది తెలియాల్సి ఉంది.
అయితే బిజెపి నుంచి పవన్ ను వేరు చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. జనసేన బిజెపి భాగస్వామ్య పక్షంగా ఉంది. బిజెపిని ఒప్పించి కూటమిలోకి తెప్పిస్తానని పవన్ భావించారు. మూడు పార్టీల ఉమ్మడి వేదికగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడే చంద్రబాబు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ముందుగా రెండు పార్టీల జాబితా విడుదల చేద్దామని.. బిజెపి వచ్చిన తర్వాత మిగతా సీట్లతో మరో జాబితా ప్రకటిద్దామని ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. దీనికి పవన్ సమ్మతించడంతో తొలి జాబితా ప్రకటించారు. అయితే ఈ జాబితాలో బిజెపి ఆశిస్తున్న కీలక నియోజకవర్గాలు సైతం ఉన్నాయి. దీంతో ఉన్న దాంట్లో ఉన్న సీట్లు తీసుకోవాలి. లేదంటే బిజెపి వెనక్కి తగ్గాలి. అంతకంటే ఒరిగిందేమీ లేదు. అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగా పవన్ బిజెపికి దూరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు సక్సెస్ అయినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు వైసీపీని టార్గెట్ చేసుకుంటున్నారు. ఆ పార్టీ నుంచి చేరికలకు ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధికి నూజివీడు టిక్కెట్ను ప్రకటించారు. ఆయన లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. అటు తరువాత విజయవాడ వైసిపి నగర అధ్యక్షుడు భవకుమార్ సైతం తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఈ జాబితాలో చాలామంది ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇలా రోజుకొకరు టిడిపిలో చేరేలా ప్లాన్ చేస్తున్నారు. తద్వారా వైసిపి పని అయిపోయిందని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సంకేతాలు పంపించేందుకు వ్యూహం పన్నుతున్నారు. మొత్తానికైతే ఏకకాలంలో చంద్రబాబు చేస్తున్న వ్యూహాలు సక్సెస్ ఫుల్ గా నిలుస్తున్నాయి. అయితే అవి ఎన్నికల్లో ఎంతవరకు మంచి ఫలితాలు ఇస్తాయో చూడాలి.