Chandrababu : ప్రతి వ్యక్తికి ఒక అరుదైన రోజు అంటూ ఉంటుంది. ఫలానా తేదీ అని గుర్తుండిపోతుంది. డేట్ అఫ్ బర్త్, మ్యారేజ్ డే.. ఉద్యోగంలో చేరిన మొదటి తేదీ, పదవి పొందిన మొదటి తేదీ.. ఇలా అరుదైన రోజులు ఉంటాయి. అటువంటి అరుదైన రోజు చంద్రబాబుకు( AP CM Chandrababu) ఒకటి ఉంది. అదే మార్చి 15. ఆయన జీవితంలో మరిచిపోలేని రోజు. సరిగ్గా 47 ఏళ్ల కిందట ఇదే రోజున ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. చట్టసభలకు పరిచయం అయ్యారు. ఆనాటి నుంచి ఇంతవరకు ఆయన రాజకీయంగా వెనుదిరిగి చూడలేదు. ఆ అవసరం కూడా రాలేదు. తన 47 ఏళ్ల రాజకీయ జీవితంలో.. ఓ ఐదేళ్లు మినహా 41 ఏళ్లపాటు ఆయన శాసనసభ్యుడిగా కొనసాగుతూనే ఉన్నారు. 28 ఏళ్ల వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. 30 ఏళ్లకే మంత్రి అయ్యారు. అందుకే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన మార్చి 15 ను పరమ పవిత్రంగా భావిస్తారు చంద్రబాబు.
Also Read : వ్యవసాయమా.. చంద్రబాబుకు సాయమా? విజయసాయి రెడ్డి పై వైసీపీ కౌంటర్!
* పారిశుద్ధ్య కార్మికులతో మమేకం..
స్వర్ణాంధ్ర- స్వచ్ఛ్ ఆంధ్ర ( swarnandhra – swaccha Andhra) కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈరోజు పర్యటించారు చంద్రబాబు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పట్టణంలో స్వయంగా చీపురు చేతబట్టి చెత్త ఊడ్చారు. చెత్తను తట్టల్లోకి ఎత్తారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికుడి యూనిఫాం వేసిన చంద్రబాబు పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి జీవనస్థితిగతులను మార్చే విధంగా చర్యలు చేపడతానని భరోసా ఇచ్చారు. అనంతరం సభలో మాట్లాడుతూ మార్చి 15 ప్రాధాన్యతను వివరించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేగా అడుగుపెట్టి 47 సంవత్సరాలు అవుతుందని.. అందుకే తనకు మార్చి 15 అంటే ఎంతో ఇష్టం అన్నారు.
* విద్యార్థి సంఘ నేతగా
విద్యార్థి సంఘ నాయకుడిగా( student leader) ఎదిగారు చంద్రబాబు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికల్లో విద్యార్థి సంఘ నేతగా ఎన్నికయ్యారు. అటు తరువాత యువజన కాంగ్రెస్లో చేరారు. 1978లో చంద్రగిరి నుంచి తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మంత్రిగా కూడా ఎన్నికయ్యారు. 1980 నుంచి 83 వరకు రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. మంత్రిగా ఉన్న సమయంలోనే 1981 సెప్టెంబర్ 10న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు చంద్రబాబు. అటు తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019, 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 1995 లో తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో ఉమ్మడి రాష్ట్రంలో మరోసారి సీఎం గా గెలిచారు చంద్రబాబు. 2004, 2009లో ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యారు. 2019లో మాత్రం దారుణ పరాజయం చవిచూశారు కానీ ప్రతిపక్షనేతగా కొనసాగారు. 2024 ఎన్నికల్లో గెలిచి నవ్యాంధ్రప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తన రాజకీయ ఉన్నతికి కారణమైన మార్చి 15 అంటే చంద్రబాబుకు ఎనలేని ఇష్టం. అందుకే ఈరోజు ఖర్చంత ప్రాధాన్యమిస్తారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అందులో భాగంగా ఈరోజు పారిశుధ్య కార్మికులతో మమేకం అయ్యారు.
Also Read : జగన్ పై చంద్రబాబు సంచలన ఆరోపణలు!