Vijaya Ramaraju Setrucharla: ఉమ్మడి విజయనగరం జిల్లాలో కురుపాం నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గంలో నుంచి హేమాహేమీలు రాజకీయాల్లో రాణించారు. కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్ర దేవ్, రాష్ట్ర మాజీ మంత్రి శత్రు చర్ల విజయరామరాజు ఇదే నియోజకవర్గానికి చెందినవారు. కిషోర్ చంద్ర దేవ్ ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రి అయ్యారు. ఢిల్లీలో చక్రం తిప్పారు. శత్రుచర్ల విజయరామరాజు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సాధించారు. మొన్నటి వరకు ఈ ఇద్దరు నేతలు తెలుగుదేశం పార్టీలో ఉండగా.. కిషోర్ చంద్ర దేవ్ పార్టీకి రాజీనామా చేశారు. ఇంకా ఏ పార్టీలో చేరలేదు. అయితే కురుపాం నియోజకవర్గంలోపట్టు కోసం శత్రుచర్ల విజయరామరాజు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ప్రయత్నానికి చంద్రబాబు చెక్ చెప్పారు.
కురుపాం నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పాముల పుష్ప శ్రీవాణి ఉన్నారు. మొన్నటి వరకు ఈమె డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు. ఈమె స్వయానా శత్రుచర్ల విజయరామరాజు తమ్ముడు చంద్రశేఖర్ రాజు కోడలు. 2014లో విజయరామరాజును విభేదించి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో కురుపాం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. విజయం సాధించారు. 2019లో మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. జగన్ క్యాబినెట్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తో పాటు డిప్యూటీ సీఎం పదవిని చేజిక్కించుకున్నారు.ఇప్పుడు మూడోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే వయోభారంతో బాధపడుతున్న శత్రుచర్ల విజయరామరాజు ఇక్కడ టిడిపికి పెద్దదిక్కుగా ఉన్నారు. ఆయన ఎంపిక చేసిన తోయక జగదీశ్వరిని టిడిపి అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. ప్రస్తుతం ఆమె ముమ్మర ప్రచారం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే శత్రుచర్లకు ఝలక్ ఇస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ నుంచి పోటీ చేస్తున్న పుష్పశ్రీవాణి బలమైన అభ్యర్థి. ఆమెను ఢీ కొట్టాలంటే తోయిక జగదీశ్వరి సరైన అభ్యర్థి కారని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. అందుకే చిన్న మేరంగి రాజులు తెరపైకి వచ్చారు. పార్టీకి రాజీనామా చేసిన కిషోర్ చంద్రదేవ్ సోదరుడు ప్రదీప్ దేవ్ కుమారుడు వీరేష్ చంద్ర దేవ్ పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తోయిక జగదీశ్వరిని తప్పించి వీరేశ్ చంద్రదేవ్ ని ఖరారు చేయడం దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇటీవల తోయిక జగదీశ్వరి భర్త ఈసీ నిబంధనలను పాటించలేదని నోటీసులు అందుకున్నారు. జగదీశ్వరి గెలుపు బాధ్యతలను శత్రుచర్ల విజయరామరాజు తీసుకున్నారు. జగదీశ్వరి సామాన్య గిరిజన మహిళ. ఆర్థికంగా అంతంత మాత్రమే. అయినా సరే గత ఐదేళ్లుగా పార్టీ ఇంచార్జ్ బాధ్యతలను శత్రుచర్ల సహకారంతో నిర్వర్తిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అభ్యర్థిని మార్చడానికి డిసైడ్ అవ్వడంతో.. శత్రుచర్ల విజయరామరాజు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.