Chandrababu Liquer polacy : ఏపీలో కూటమి ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకవైపు పాలనను గాడిలో పెడుతూనే గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నంలో ఉన్నారు సీఎం చంద్రబాబు. ప్రజాక్షేత్రంలో ఆ వైఫల్యాలను రుజువు చేస్తున్నారు. వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా ఇటీవల మద్యం అస్తవ్యస్త విధానాలపైగణాంకాలతో సహా వైఫల్యాలను వెల్లడించారు. ఒక్క మద్యం విధానంలోనే దాదాపు 30 వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు అసెంబ్లీ వేదికగా ఆదేశించారు. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు సీఎం. గత ఐదు సంవత్సరాలుగా భారీగా అవినీతి జరిగిందని భావిస్తున్నారు. నాసిరకం మద్యంతో వైసీపీ నేతల డిస్టలరీలు రెచ్చిపోయాయని.. కమీషన్ల రూపంలో వైసీపీ నేతలు దండుకున్నారని కూడా ఒక అంచనాకు వచ్చారు. అందుకే దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఈ విచారణకు ఎక్సైజ్ అధికారులు సైతం సహకరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మద్యం విధానంలో గత ఐదేళ్లుగా ఫైళ్లను సీజ్ చేయాలని తాజాగా ఆదేశించారు. 2019 అక్టోబర్ 2 నుంచి అమల్లోకి వచ్చిన వైసిపి మద్యం విధానం, తీసుకున్న నిర్ణయాలు, డిస్టలరీల కేటాయింపులకు సంబంధించి ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అయితే కొందరు అధికారుల సాయంతో ఫైళ్లు మాయం చేసే అవకాశం ఉందని.. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం మాదిరిగా జరిగే అవకాశం ఉందని అనుమానించి.. ఏకంగా ఫైళ్లను సీజ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.దీంతో అవినీతికి పాల్పడిన నేతలు, అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
* ప్రభుత్వమే నేరుగా దుకాణాలు
2019లో వైసిపి అధికారంలోకి వచ్చింది. నూతన మద్యం పాలసీని ప్రకటించింది. అప్పటివరకు ఉన్న ప్రైవేటు మద్యం షాపులను రద్దు చేసింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపేందుకు నిర్ణయించింది. సొంతంగా సిబ్బందిని నియమించుకొని షాపులను నిర్వహిస్తూ వస్తోంది. అయితే అస్మదీయ కంపెనీలకు పెద్దపీట వేశారని, బ్రాండెడ్ మద్యం విక్రయాలు నిలిపివేశారని, కమీషన్లకు కక్కుర్తి పడి మద్యం సరఫరా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 30 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆధారాలతో సహా వివరాలను వెల్లడించారు సీఎం చంద్రబాబు.
* అటకెక్కిన మద్య నిషేధం
వాస్తవానికి 2019 ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. నవరత్నాల్లో సైతం చేర్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇప్పటికిప్పుడు మద్య నిషేధం చేయలేనని తేల్చేశారు. నాలుగు సంవత్సరాలలో షాపులు తగ్గించుకొని.. నిషేధం చేశాకే ఎన్నికలకు వెళ్తానని చెప్పుకొచ్చారు. మద్యం ధరలను సైతం అమాంతం పెంచేశారు. పేదవాడికి షాక్ కొట్టే ధరలు ఉంటే మద్యం మానేస్తాడని.. అప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ కి మద్యం అమ్మకాలను పరిమితం చేస్తామని నమ్మబలికారు. కానీఈ విషయంలో చెప్పిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. పైగా నాసిరకం మద్యంతో ప్రజారోగ్యంతో చెలగాటం ఆడారని విమర్శలు ఉన్నాయి.
* కీలక నిర్ణయం
వైసిపి హయాంలో మద్యం విధానంలో ఆ నలుగురిదే కీలక పాత్ర అని వార్తలు వచ్చాయి. ప్రభుత్వ పెద్దలతో పాటు నాడు సీఎంఓలో కీలక అధికారి ఒకరు బాగా లాభపడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం అవినీతిపరుల విషయంలో నిజనిర్ధారణ కావాలని భావిస్తున్నారు. అందుకే ఫైళ్ళు మాయం కాకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ.. సీజ్ చేయాలని సూచించారు.