https://oktelugu.com/

Weather Report : ఏపీ తెలంగాణకు హెచ్చరికలు జారీ.. ప్రజలకు హైఅలెర్ట్.. వచ్చే వారం జాగ్రత్త

ఏపీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.తెలంగాణలో మాత్రం విరివిగా వర్షాలు పడుతున్నాయి.ఈ తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 3, 2024 / 11:15 AM IST

    AP Weather

    Follow us on

    Heavy rain : తెలుగు రాష్ట్రాలకు భారీ హెచ్చరిక. వర్షాలు ముంచెత్తనున్నాయి. ముఖ్యంగా ఏపీకి భారీ వర్ష సూచన ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. పశ్చిమ బెంగాల్ సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. అది వాయువ్య దిశగా పైనుంచి వాయుగుండం గా మారనుందని ఐఎండి తెలిపింది. దీంతో ఈ రోజు నుంచి ఆరో తేదీ వరకు ఏపీవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు తేలికపాటి జల్లులతో వర్షం ప్రారంభం కానుంది. ప్రధానంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్,కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైయస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అయితే కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడి అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇప్పుడిప్పుడే గోదావరి నదిలో వరద ఉధృతి తగ్గుతోంది. భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు కూడా. ధవలేశ్వరం వద్ద గోదావరి స్థిరంగా కొనసాగుతోంది. అయితే ఇంకా కృష్ణా నదిలో మాత్రం వరద అలానే కొనసాగుతోంది.

    * తెలంగాణకు సైతం
    అయితే ఈ వాయుగుండంతో తెలంగాణకు సైతం భారీ వర్ష సూచన ఉంది. అక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గత నెల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగావిస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జలాశయాలు నిండుకున్నయి కూడా. ఇటువంటి తరుణంలో వాయుగుండం ప్రభావంతో నాలుగు నుంచి ఐదు రోజులు పాటు తెలంగాణలో సైతం వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.

    * ఈ జిల్లాలకు భారీ సూచన
    తెలంగాణకు సంబంధించి నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, కామారెడ్డి, కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, జనగమలలో భారీ వర్షాలు కురవనున్నాయి.

    * నిండుకుండలా ప్రాజెక్టులు
    మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో కృష్ణ, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టులోని 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కృష్ణానది పోటెత్తుతోంది. కృష్ణా పరివాహక ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.