Achyutapuram Fire accident  : మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం.. చంద్రబాబు సర్కార్ పెద్ద మనసు

అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. దాదాపు 18 మంది చనిపోగా.. మరో 60 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పుకొచ్చింది.

Written By: NARESH, Updated On : August 22, 2024 11:46 am

Achyutapuram Fire accident compensation

Follow us on

Achyutapuram Fire accident : ఫార్మా కంపెనీలో మృతుల కుటుంబాలకు అండగా నిలిచింది ఏపీ ప్రభుత్వం. నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కొక్కరికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.గాయపడిన వారికి మెరుగైన చికిత్స తో పాటు పరిహారం అందజేస్తామని చెప్పారు. మరోవైపు కేంద్రం తరపున కూడా ప్రధాని మోదీ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల పరిహారం, క్షతగాత్రులకు 50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తామని చెప్పారు. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందడం పై ప్రధాని సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. ఈరోజు ఉదయం అనకాపల్లి వెళ్ళనున్నారు. ఉదయం 10:30 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు చంద్రబాబు బయలుదేరి వెళ్తారు. మృతుల కుటుంబాలతో పాటు ప్రమాదంలో గాయపడిన వారికి పరామర్శిస్తారు. అక్కడ వైద్య నిపుణులతో మాట్లాడుతారు. మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు ఫార్మా కంపెనీలోని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలిస్తారు. అనంతరం తిరిగి ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.

* సంచలన ఘటన
ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు తక్షణ ఆర్థిక వైద్య సహాయం చేయాలని సూచించారు.

* కొనసాగుతున్న సహాయ చర్యలు
ఇంకా కంపెనీ వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. హోం మంత్రి వంగలపూడి అనిత ఆసుపత్రుల్లో బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి సైతం పరిహారం అందజేస్తామని చెప్పారు. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

* ఇంకా కానరాని ఆచూకీ
ప్రమాదం జరిగే సమయంలో దాదాపు 300 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గాయపడిన వారు 60 మందికి పైగా ఉన్నారు. అయితే చాలామంది ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. వారికోసం ఆరా తీస్తున్నారు. ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుల వివరాలు వెల్లడించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.