https://oktelugu.com/

Chandrababu: సోము వీర్రాజుపై చంద్రబాబు ప్రతీకారం!

గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. బిజెపికి వ్యతిరేకంగా మారారు. గత ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : March 28, 2024 / 12:36 PM IST

    Chandrababu

    Follow us on

    Chandrababu: సోము వీర్రాజును చంద్రబాబు దారుణంగా దెబ్బతీశారా? బిజెపిలో ఉనికి లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారా? పూర్తిగా తొక్కేయాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. బిజెపి ప్రకటించిన పార్లమెంటు స్థానాల్లో కానీ.. అసెంబ్లీ సీట్లలో కానీ.. సోము వీర్రాజుకు చోటు లేకుండా పోయింది. ఆయనకు ఎక్కడా టిక్కెట్ కేటాయించలేదు. దీని వెనుక చంద్రబాబు హస్తము ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆది నుంచి టిడిపి, చంద్రబాబు విషయంలో సోము వీర్రాజు వ్యతిరేక భావనతోనే ఉండేవారు. పొత్తు విషయంలో అడ్డంకిగా నిలిచారు. జగన్ కు మించి చంద్రబాబుపై ఆరోపణలు చేయడంలో ముందంజలో ఉండేవారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు అదును చూసి దెబ్బ కొట్టారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. బిజెపికి వ్యతిరేకంగా మారారు. గత ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సోము వీర్రాజు నియమితులయ్యారు. అదే సమయంలో ఓటమి నుంచి తేరుకున్న చంద్రబాబు బిజెపి స్నేహం కోసం ప్రయత్నించారు. తన వద్ద ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపిలోకి పంపించారు. రాష్ట్రస్థాయి నాయకులు సైతం టిడిపిని వీడి బిజెపిలో చేరారు. దీంతో బిజెపిలో ప్రో వైసిపి, ప్రో టిడిపి అన్న విధంగా నాయకులు మారిపోయారు. జగన్ కంటే చంద్రబాబుపై సోము వీర్రాజు విమర్శలు చేయడంతో ఆయన జగన్ మనిషిగా ముద్రపడ్డారు.

    బిజెపితో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ చేయని ప్రయత్నం లేదు.కానీ బిజెపి టిడిపి తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోదని సోము వీర్రాజు స్పష్టంగా చెప్పేవారు. అసలు పొత్తు ఆలోచన లేదని కూడా తేల్చి చెప్పేవారు. అయితే జనసేనతో లేదా ఒంటరి పోరాటంతోనే బిజెపి ఏపీలో బలోపేతం అవుతుందని చెప్పుకొచ్చేవారు.అధిష్టానానికి కూడా ఎప్పటికప్పుడు టిడిపి చర్యలను నివేదించేవారు. దీంతో సోము వీర్రాజు అధ్యక్ష పదవిలో ఉండగా పొత్తులు అసాధ్యమని కామెంట్స్ వినిపించాయి. అందుకే ఆయనను తప్పించాలని టిడిపి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది. దీంతో సోము వీర్రాజును తప్పించి బిజెపి హై కమాండ్ పురందేశ్వరిని నియమించింది. అప్పటి నుంచి బిజెపిలో పరిణామాలు చంద్రబాబుకు అనుకూలంగా మారాయి. పొత్తుల అంశం కొలిక్కి వచ్చింది.తనకు నచ్చిన వారికి చంద్రబాబు టిక్కెట్లు ఇప్పించుకున్నారు. తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించిన సోము వీర్రాజు,జివిఎల్ నరసింహరావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలను చంద్రబాబు తొక్కి పెట్టారు. మరీ ముఖ్యంగా సోము వీర్రాజుకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారు.

    బిజెపిలో సోము వీర్రాజుది సుదీర్ఘ నేపథ్యం. 1980లో బీజేపీ యువ మోర్చాలో సోము వీర్రాజు పని చేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన కెరీర్ ను ప్రారంభించారు. అంచలంచెలుగా ఎదిగి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి చేపట్టారు. వాస్తవానికి ఈసారి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని సోము వీర్రాజు భావించారు. కానీ ఆ సీటును పురందేశ్వరి తన్నుకు పోయారు. రాజమండ్రి అర్బన్ కానీ.. రూరల్ అసెంబ్లీ సీటును ఆశించారు. కానీ ఆ రెండు సీట్లు కూడా టిడిపి వదులుకోలేదు. అయితే సోము వీర్రాజుకు అనపర్తి ఆఫర్ చేశారు. కానీ అక్కడ పరిస్థితి బాగాలేదని గ్రహించిన వీర్రాజు ముందుకు రాలేదని తెలుస్తోంది. మొత్తానికైతే తనకు అడ్డంకిగా నిలిచిన సోము వీర్రాజును చంద్రబాబు తొక్కి పెట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.