Homeఆంధ్రప్రదేశ్‌Kesineni Nani: చంద్రబాబు ఓకే.. టిడిపిలోకి ఆ మాజీ ఎంపీ?!

Kesineni Nani: చంద్రబాబు ఓకే.. టిడిపిలోకి ఆ మాజీ ఎంపీ?!

Kesineni Nani: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన చాలామంది టిడిపి నేతల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. అందుకే గత ఎన్నికలకు ముందు చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆ పార్టీకి రాజీనామా చేసిన వారు ఉన్నారు. అటువంటి వారిలో మాజీ ఎంపీ కేసినేని నాని ఒకరు. రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఆయన.. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ఓడిపోవడంతో ఆ పార్టీ నుంచి సైతం వైదొలిగారు. ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. కానీ దూరం ఉండలేకపోయారు. ఆయన టిడిపిలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం అయితే మాత్రం జరుగుతోంది.

* ప్రజారాజ్యం ద్వారా ఎంట్రీ..
ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కేసినేని నాని. కేశినేని ట్రావెల్స్ ద్వారా ఆయన వ్యాపార రంగంలో తిరుగులేని వ్యక్తిగా ఉండేవారు. అలా 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో మూడో స్థానం దక్కింది. అయితే చంద్రబాబు దృష్టిలో పడిన కేసినేని నాని తర్వాత టిడిపిలోకి వచ్చారు. 2014లో టిడిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఐదేళ్లపాటు తన పనితీరుతో మంచి పార్లమెంటేరియన్ గా గుర్తింపు సాధించారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం నిలబడ్డారు. అయితే అప్పుడే కృష్ణాజిల్లా టిడిపి నేతలతో ఆయనకు పడక.. నిత్యం అసంతృప్తిని వెల్లగక్కే వారు. ఈ క్రమంలో టిడిపి హై కమాండ్ కు దూరమయ్యారు.. అనుకోని రీతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

* సోదరుడికి ఛాన్స్..
అయితే సోదరుడు టిడిపికి దూరమయ్యారు కానీ కేశినేని చిన్ని రూపంలో ఆ కుటుంబ సభ్యుడు మాతృ పార్టీలోనే ఉండిపోయారు. దీంతో టీడీపీ సైతం కేశినేని నాని పై ఆయన సోదరుడు చిన్నిని నిలబెట్టాలని నిర్ణయించి టికెట్ ఇచ్చింది. కానీ నిబద్ధత విషయంలో కేశినేని నాని మాదిరిగా చిన్ని ఉండలేకపోయారన్న విమర్శ ఉంది. ఎందుకంటే మద్యం కుంభకోణం తో పాటు చాలా వ్యవహారాల్లో వైసిపి నేతలతో చిన్ని చేతులు కలిపారు అన్న విమర్శలు ఉన్నాయి. పైగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విషయంలో చిన్ని వ్యవహరించిన తీరు కూడా విమర్శలకు తావిచ్చింది. కొన్ని రకాల అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. పదేళ్లపాటు టిడిపి ఎంపీగా ఉన్నారు కేసినేని నాని. కానీ ఆ సమయంలో ఎటువంటి వివాదాలు రాలేదు. కానీ చిన్ని ఎంపీ అయిన రెండేళ్ల వ్యవధిలోనే అనేక రకాల వివాదాలను మూటగట్టుకున్నారు. ఈ పరిణామాలన్నింటినీ టిడిపి హై కమాండ్ నిశితంగా గమనిస్తోంది.

* కుమార్తెకు అవకాశం ఇస్తే..
మరోవైపు కేశినేని నాని చంద్రబాబు పట్ల వీర విధేయత కనబరుస్తూ వచ్చారు. అదే సమయంలో కృష్ణాజిల్లా టిడిపి నేతలు లోకేష్ తో కలివిడిగా ఉండడం నానికి ఇష్టపడేది కాదు. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ మేయర్ అభ్యర్థిగా బరిలో దిగిన నాని కుమార్తెను ఓడించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణ ఉంది కొంతమంది టీడీపీ నేతలపై. అయితే ఇప్పుడు చంద్రబాబు అనుమతిస్తే తిరిగి పార్టీలో చేరిపోతానని.. తన కుమార్తెకు విజయవాడ మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని నాని కోరినట్లు తెలుస్తోంది. అందుకు చంద్రబాబు సైతం సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular