Chandrababu Foreign Tour: ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు పెంచింది. పెట్టుబడుల వేటలో పడింది. ఒకవైపు మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. సీఎం చంద్రబాబు నవంబర్ మొదటి వారంలో లండన్ పర్యటనకు వెళ్ళనున్నారు. అయితే తాజాగా ఈరోజు గల్ఫ్ దేశాల పర్యటనకు బయలుదేరనున్నారు చంద్రబాబు. దుబాయ్, అబుదాబి, యూఏఈ లో పర్యటించనున్నారు. వచ్చే నెలలో విశాఖలో పెట్టుబడుల సదస్సు జరగనుంది. పారిశ్రామికవేత్తల కోసం ఆయన పర్యటన కొనసాగునుంది. స్వయంగా ఆదేశాలకు వెళ్లి పారిశ్రామికవేత్తలతో రోడ్ షో నిర్వహించనున్నారు. పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వారికి వివరించనున్నారు.
* ఆ రంగాల్లో పెట్టుబడులకు..
ప్రధానంగా ఏపీలో రియల్ ఎస్టేట్( real estate), భవన నిర్మాణం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. వివిధ దేశాల నుంచి పెట్టుబడుదారులను ఆకర్షించి.. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బాటలు వేయాలని భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి వెళ్ళనున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులను సైతం తీసుకెళ్లనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వీరంతా వివరించనున్నారు.
* విశాఖ పెట్టుబడుల సదస్సుకు..
వచ్చే నెలలో విశాఖలో( Visakhapatnam) పెట్టుబడుల సదస్సు జరగనుంది. ప్రపంచ దిగ్గజ సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం వారితో కీలక ఒప్పందాలు చేసుకునే పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు భారీగా పెట్టుబడులు వచ్చే వీలుగా సీఎం చంద్రబాబు గల్ఫ్ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ ఉండే ఎన్నారై, ప్రవాసాంధ్రులను సైతం కలవనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టించే వీలుగా వారిని ఒప్పించనున్నారు. మరోవైపు నవంబర్ రెండు నుంచి ఐదు వరకు లండన్ పర్యటనకు వెళ్తున్నారు చంద్రబాబు. అది కూడా పెట్టుబడుల సాధనే లక్ష్యంగా కొనసాగనుంది. ఏపీ అభివృద్ధికి పరిశ్రమల రాక అనేది కీలకం అని భావిస్తున్న కూటమి ప్రభుత్వం.. విశాఖ పెట్టుబడుల సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో సీఎం చంద్రబాబు సింగపూర్, దావోస్ లలో పర్యటించి పెట్టుబడుదారులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా, సీఎం చంద్రబాబు గల్ఫ్ దేశాల పర్యటన ఒకే సమయంలో జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తాయని మాత్రం ఒక అంచనా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?