Chandrababu Meets Chiranjeevi: ఇటీవల ఏపీలో( Andhra Pradesh) జరిగిన రాజకీయ పరిణామాలతో పరిస్థితి మారింది. ముఖ్యంగా శాసనసభలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఎప్పటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై సినీ పరిశ్రమకు ఉన్న అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు కుల రాజకీయాన్ని తెరపైకి తెస్తోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి కారణమైన వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్పందించారు. తన వ్యాఖ్యలతోనే అపార్ధాలు చోటుచేసుకున్నాయని.. వాటిని రికార్డుల నుంచి తొలగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కోరారు. మరోవైపు చిరంజీవితో మాట్లాడేందుకు కొందరు ప్రముఖులు సైతం రంగంలోకి దిగినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏపీ సీఎం చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవితో సమావేశం అవుతారని తెలుస్తోంది.
* బాలకృష్ణ వ్యాఖ్యలతో మారిన సీన్..
సాధారణంగా నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna)అసెంబ్లీకి హాజరు కారు. చాలా అరుదుగా వస్తారు. అటువంటిది వచ్చి రాగానే ఈ అంశం పై మాట్లాడుతూ రచ్చ చేశారు. అయితే వాస్తవానికి నందమూరి బాలకృష్ణ స్పందనలో తప్పులేదు. కానీ చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చి.. అప్పట్లో ఎవరూ గట్టిగా అడగలేదని అనేసరికి చిరంజీవి స్పందించాల్సి వచ్చింది. తన కోరిక మేరకు మాత్రమే అప్పట్లో టిక్కెట్ ధరల పెంపునకు వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మాత్రమే చెప్పారు. అయితే అది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అప్పట్లో చిరంజీవి విషయంలో జగన్మోహన్ రెడ్డి సోదర భావంతో మెలిగేవారని.. సినీ పరిశ్రమకు చాలా రకాల సహాయం చేశారని ప్రచారం చేయడం ప్రారంభించింది. అదే సమయంలో కూటమి పార్టీలో కీలక భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి ఇరకాటంలో పడ్డారు. ఇటువంటి విషయాల్లో దూకుడుగా స్పందించే ఎమ్మెల్సీ నాగబాబు సైతం సైలెంట్ అయ్యారు. అయితే ఈ మొత్తం పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే చంద్రబాబు రంగంలోకి దిగనున్నారు. నేరుగా మెగాస్టార్ చిరంజీవితో సమావేశం అయి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నారు.
* పరస్పరం గౌరవం..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సార్లు చంద్రబాబును కలిశారు చిరంజీవి. వివిధ వేదికల వద్ద కలిసినప్పుడు ఈ ఇద్దరూ పరస్పరం గౌరవించుకున్నారు. చిరంజీవిని చంద్రబాబు ఎక్కువగా అభిమానించారు. అదే సమయంలో చిరంజీవి సైతం చంద్రబాబును చాలా గౌరవభావంతో చూసేవారు. మరోవైపు తన సోదరుడు పవన్ కళ్యాణ్ కూటమిలో కీలక భాగస్వామి కావడంతో చిరంజీవి సైతం చాలా బాధ్యతగా మెలిగేవారు. అందుకే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉన్నారు చిరంజీవి. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో నిత్యం మాట్లాడుతూ ఉండేవారు. పరిశ్రమలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునేవారు. ఈ క్రమంలోనే చిన్న చిన్న తప్పిదాలు జరిగాయి. అయితే పరిశ్రమ కోణంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. కానీ ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కూటమికి డ్యామేజ్ చేస్తున్నాయి. అందుకే దిద్దుబాటు చర్యల్లో భాగంగా చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో సమావేశంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.