Chandrababu vs Jagan: ఒకప్పుడు రాజకీయాలు ఇలా ఉండేవి కావు. అధికార, ప్రతిపక్షాల మధ్య విధానాల పరంగానే రాజకీయాలు సాగేవి. అవి అక్కడితోనే ఆగిపోయేవి. కానీ ఇప్పుడు రాజకీయాలు వ్యక్తిగత కక్షలకు దారితీస్తున్నాయి. కుటుంబ వ్యవహారాలలోకి కూడా ప్రవేశిస్తున్నాయి. నేతల నోటి వెంట నుంచి బూతులు యధావిధిగా వస్తున్నాయి. విలువలు అనేవి మంట కలిసి పోతున్నాయి. వలువలు అనేవి లేకుండా పోతున్నాయి. అలాంటి రాజకీయాలలో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి. ఇక ఏపీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఏపీలో కూటమి వర్సెస్ ఫ్యాన్ పార్టీ మధ్య రాజకీయాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రతిరోజు ఏపీలో ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. పోటాపోటీగా విమర్శలు.. ప్రతి విమర్శలతో అక్కడ వాతావరణం యుద్ధ రంగాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ హాజరు కావడం లేదు. వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతారని వార్తలు వచ్చినప్పటికీ.. అవన్నీ నిజం కావని తేలిపోయింది. ప్రతిపక్ష హోదా లేనందున తాను అసెంబ్లీకి రాబోనని జగన్ అంటున్నారు. నిబంధనల ప్రకారం సీట్లు గెలుచుకోలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తామని చంద్రబాబు అంటున్నారు. ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి సరికొత్త స్కెచ్ వేశారు.
Also Read: ఏపీ వైపు ముంచుకొస్తున్న తీవ్రవాయు’గండం’
ప్రస్తుతం కృత్రిమ మేధ సాంకేతిక ప్రపంచాన్ని ఊపేస్తోంది. కృత్రిమ మేధ తోనే జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎందుకంటే ఏపీ అసెంబ్లీలో కృత్రిమ మేధా ఆధారంగా హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కొద్దిరోజులుగా దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. డిసెంబర్లో జరిగే శీతాకాల సమావేశంలో దీనిని అందుబాటులోకి తీసుకొస్తుందని తెలుస్తోంది. సభ్యుల హాజరు పట్టికలో సంతకం చేసి వెళ్తూ ఉండడంతో కచ్చితంగా లోపిస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దుర్వినియోగానికి చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ సహకారంతో పని చేసే కెమెరాలు సభ్యుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తాయి. తద్వారా సంతకం పెట్టి వెళ్లడం కుదరదు. అన్నిటికంటే ముఖ్యంగా సభకు హాజరు కాకుండా రావడం కుదరదు. ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిణామమని ఏపీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ ఏఐ ఆధారిత హాజరు విషయంలో ఇంతవరకు వైసీపీ మాట్లాడలేదు. దీనిపై ఆ పార్టీ నాయకులు ఏమంటారో చూడాల్సి ఉంది.