CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు వద్ద ఎమ్మెల్యేల నివేదిక ఉందా? అందునా టీడీపీ ఎమ్మెల్యేలపై ఆయన నివేదిక తెప్పించుకున్నారా? ఓ 48 మంది ఎమ్మెల్యేల తీరు బాగాలేదా? మారుతారా? లేకుంటే మార్చేయమంటారా? అనే హెచ్చరికలు పంపారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. 2024 ఎన్నికల్లో అంతులేని విజయ గర్వంతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అందుకే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో రాజీ పడ్డారు. అందుకు తగ్గట్టు ఎన్నికల్లో మంచి ఫలితమే దక్కించుకున్నారు. 135 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సొంత పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ కొద్ది మంది ఎమ్మెల్యేలు పార్టీకి, కూటమికి చెడ్డపేరు తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్నారు.
మీరు మారతారా? మార్చేయమంటారా? ఇది తరచూ చంద్రబాబు నుంచి వినిపించే మాట. కానీ చాలామంది జగన్ సర్కారుపై వ్యతిరేకత, ఆపై కూటమి ప్రభంజనంలో గెలిచేశారు. అయితే టీడీపీ గెలవని నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీ అభ్యర్థులుగా పోటీచేసిన వారు గెలిచారు. దీంతో అది పార్టీ కాదు.. మా చరిష్మతో గెలిచామన్న ధీమా వారిలో ఉంది. అందుకే పార్టీ నాయకత్వాన్ని లైట్ తీసుకున్నారు. బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. అలా భావిస్తున్న వారు బయటకు వెళ్లిపోవచ్చని తేల్చేశారు.
గతానికి భిన్నంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. గతంలో కేవలం డెవలప్ మెంట్ అనే కాన్సెప్ట్ తో చంద్రబాబు పాలన నడిచేది. సంక్షేమ పథకాలు అనేవి ఆయన ఆలోచన కానేకాదు. కానీ నాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి, నేడు జగన్మోహన్ రెడ్డి వైఖరితో చంద్రబాబు ఆలోచన మారింది. వారితో సమానంగా సంక్షేమం అమలుచేయకుంటే కష్టమని భావిస్తున్నారు. అదే సమయంలో ప్రజలతో మమేకం కాకపోతే ప్రత్యర్థులు దూసుకుపోతారని.. గత అనుభవాలు తెరపైకి వస్తాయని భావిస్తున్నారు. అందుకే ప్రజాదర్బార్లు నిర్వహించి ప్రజల కష్టాలు తెలుసుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. కానీ ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.
మరోవైపు తాజాగా సీఎం చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ఓ 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా కష్టాల్లో ఉన్న ప్రజలు, ఆర్థిక, అనారోగ్య కష్టాలు ఉన్నవారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆశ్రయిస్తుంటారు. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో రాజశేఖర్ రెడ్డి ముందు వరుసలో ఉండేవారు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు ముందంజలో ఉంటున్నారు. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినా.. కొంత మంది ఎమ్మెల్యేలు చెక్కుల పంపిణీలో వెనుకబాటులో ఉన్నారని సీఎంవోకు ఫిర్యాదులు వస్తున్నాయాట. అందుకే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ 48 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీచేసినట్టు తెలుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.