Chandrababu assurance to Devineni: తెలుగుదేశం ( Telugu Desam)కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. కానీ పార్టీ కోసం పనిచేసి, సీట్లు త్యాగం చేసిన నేతలకు మాత్రం ఇంతవరకు న్యాయం జరగలేదు. అటువంటివారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. తన విషయంలో నాయకత్వం సరైన రీతిలో వ్యవహరించడం లేదని ఆయన తన అనుచరుల వద్ద బాధపడుతున్నారు. ఈ విషయంలో ఒకరిద్దరు నేతలు కలుగజేసుకొని నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి దేవినేని ఉమామహేశ్వరరావు ను పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలో తన పేరు వినిపిస్తుందని.. తరువాత పట్టించుకునే వారు కరువవుతున్నారని.. పార్టీ కోసం త్యాగం చేస్తే తనకు కనీస గుర్తింపు లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే చంద్రబాబు దేవినేని ఉమామహేశ్వరరావుకు గట్టి హామీ ఇచ్చినట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది.
అధినేతలకు సన్నిహితుడిగా..
దేవినేని ఉమామహేశ్వరరావు( devineni Umamaheshwarao ) తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్. చంద్రబాబుతో పాటు లోకేష్ కు అత్యంత సన్నిహితుడు కూడా. అటువంటి నాయకుడు వారు చెప్పడంతో టికెట్ త్యాగం చేశారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ వదులుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన మరుక్షణం కీలక పదవి ఇస్తామన్న హామీ రెండేళ్లు అవుతున్న కార్యరూపం దాల్చడం లేదు. అయితే తప్పకుండా తనకు న్యాయం చేస్తారని ఎప్పటికప్పుడు సముదాయించుకుంటూ వస్తున్నారు దేవినేని ఉమామహేశ్వరరావు. జూన్‌లో నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తారు. అందులో టిడిపికి చెందిన ఒక్క పదవిని పాత నేతకు కొనసాగిస్తారు. ఉన్న ఒక్క పదవి కోసం చాలా పోటీ ఉంది. రకరకాల పేర్లు వినిపిస్తున్న తరుణంలో దేవినేని ఉమామహేశ్వరరావు తన బాధను సీనియర్ల వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వారిచ్చిన సమాచారంతో చంద్రబాబు దేవినేని ఉమా తో ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం.
సీనియర్ మోస్ట్ లీడర్..
1998లో తన సోదరుడు దేవినేని వెంకటరమణ అకాల మృతితో టీడీపీ బరిలో దిగారు దేవినేని ఉమామహేశ్వరరావు. ఆ ఎన్నికల్లో గెలిచిన ఆయన.. వరుసగా గెలుస్తూ వచ్చారు. తొలుతా నందిగామ నుంచి పోటీ చేసిన ఆయన నియోజకవర్గాల పునర్విభజనతో ఆ నియోజకవర్గము కనుమరుగయింది. 2014లో మైలవరం నుంచి పోటీ చేసి గెలిచిన ఉమాకు మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఒకవైపు మంత్రిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో మాత్రం చివరి నిమిషంలో వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం టికెట్ వదులుకున్నారు. అయితే ఒక బలమైన నేత త్యాగానికి ఫలితం లేకుండా పోయిందన్న ఆవేదన దేవినేని ఉమామహేష్ లో కనిపిస్తోంది.
చంద్రబాబు వద్ద ఆవేదన..
వాస్తవానికి చంద్రబాబుతో పాటు లోకేష్ కు అత్యంత సన్నిహితుడు దేవినేని ఉమామహేశ్వరరావు. ఆయనకు టికెట్ దక్కలేదంటే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ వారిద్దరూ సముదాయించడంతోనే ఆ టికెట్ వదులుకున్నారు. తనకంటే జూనియర్లకు జిల్లాలో పదవులు లభిస్తే.. తాను మాత్రం రెండేళ్ల పాటు పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉండి పోవాల్సి వచ్చిందన్న ఆవేదన ఆయనలో ఉంది. అయితే చంద్రబాబు మాత్రం ఈసారి బలమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తప్పకుండా దేవినేని ఉమామహేశ్వరరావుకు పదవి అని అనుచరులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.