Chandrababu: ఏపీలో ఈరోజు పండగ వాతావరణం. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ దాదాపు పూర్తయింది. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఇంటింటా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేళ తాళాలు, డప్పు వాయిద్యాలతో పెనుమాకలో సందడి వాతావరణం నెలకొంది. పింఛన్ల పంపిణీ అనంతరం గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ ఓడిపోయినా.. గెలవాలనే తపనతో మంగళగిరి నుంచి పోటీ చేసి 91 వేలకు పైగా మెజారిటీ సాధించారని ప్రశంసించారు.
నారా లోకేష్ ఉత్సాహభరితంగా మాట్లాడారు. గత ఐదు సంవత్సరాల్లో పరదాల ముఖ్యమంత్రిని చూశామని జగన్ ను ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు ప్రజల సీఎంను మనం చూస్తున్నామని వ్యాఖ్యానించారు. గతంలోలా పరిపాలన ఉండబోదని.. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చిందని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలేదని.. అధికారులు సెట్ కావడానికి ఇంకా సమయం పడుతుందని వేదికపై ఉన్న చంద్రబాబును ఉద్దేశించి నారా లోకేష్ అన్నారు. లేదు లేదు సెట్ అయ్యారని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అయితే ఇంకా పరదాలు కడుతున్నారని లోకేష్ బదులిచ్చారు.
అయితే లోకేష్ ఆ తరహా వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. పరదాలను కట్టే అధికారులను సస్పెండ్ చేస్తానని.. అందులో మరో మాట ఉండబోదని హెచ్చరించారు. వారు ఈ కారణం చెప్పిన వినదల్చుకోలేదని, ఎవ్వరైనా కంప్లైంట్లు చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదని స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాలు అలవాటు పడ్డారని.. మారడానికి టైం పడుతుందని నారా లోకేష్ అనగా.. అందరూ కొత్త శకానికి.. కొత్త కల్చర్ కు అలవాటు పడాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. అంత టైం కూడా లేదన్నారు. ఇన్ని రోజులు రివర్స్ పోయిన బండిని పాజిటివ్ లో నడిపిస్తున్నామని.. స్పీడ్ పెంచక తప్ప వెనక్కి వెళ్లే ఛాన్స్ లేదని తేల్చేశారు. ఈ విషయంలో ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ సెట్ కారని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించడం విశేషం. తనలో 95 వ సంవత్సరం నాటి చంద్రబాబు చూస్తారని కూడా తేల్చి చెప్పారు. ఇప్పుడు నువ్వు కుర్రాడివి నీకు తెలియదని కూడా లోకేష్ ని ఉద్దేశించి చంద్రబాబు అనడంతో సభలో నవ్వులు పూశాయి. 1995లో తాను హైదరాబాదులో బయలుదేరుతున్నాను అంటే రాష్ట్రం మొత్తం అలెర్ట్ అయిపోయేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు అంత భయంకరంగా చేయను కానీ.. తప్పు చేస్తే మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టనంటూ.. అందరూ మైండ్ సెట్ మార్చుకోవాలని గాటు హెచ్చరికలు చంద్రబాబు జారీ చేయడంతో అక్కడున్న వారు ఆశ్చర్యపడడం వంతైంది.