https://oktelugu.com/

Pawan Kalyan : జీతం తీసుకోను.. పవన్ సంచలన ప్రకటన

Pawan Kalyan : వీలైనంతవరకు సమస్యలకు పరిష్కార మార్గం చూపించాలి అనుకుంటున్నారు. ఈ క్రమంలోదర్పానికి దూరంగా ఉంటున్నారు. ఆర్భాటాలను కూడా వీలైనంత త్వరగా తగ్గించుకుంటున్నారు.

Written By: , Updated On : July 1, 2024 / 05:09 PM IST
Pawan Kalyan 1

Pawan Kalyan 1

Follow us on

Pawan Kalyan : ఏపీలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని చూసి పవన్ ఆందోళన చెందుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ పాలనపై దృష్టి పెట్టారు. కీలకమైన నాలుగు శాఖలతో పాటు డిప్యూటీ సీఎం హోదాను ఆయన దక్కించుకున్నారు. అయితే సాధారణంగా మంత్రి పదవి అంటే దర్పం ప్రదర్శిస్తారు. కానీ పవన్ మాత్రం సాధారణ ప్రజా ప్రతినిధి మాదిరిగానే ముందుకు సాగుతున్నారు. ఆర్భాటపు ఖర్చులు పెట్టడం లేదు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం శాఖల పై సమీక్షించిన పవన్.. అధికారులకు మూడు నెలల సమయం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో పురోగతి సాధించాలని.. మెరుగైన ఫలితాలు తీసుకురావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తాను సైతం కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రిగా తనకు వచ్చే వేతనాన్ని తీసుకోకూడదని డిసైడ్ అయ్యారు.

సాధారణంగా మంత్రులంటేనే భారీ వేతనాలు ఉంటాయి. నిత్యం రివ్యూలు, సమీక్షలు, శాసనసభ సమావేశాలకు హాజరైతే నిర్దిష్టంగా కొంత మొత్తం వేతనం లభిస్తుంది. దీనికి తోడు అలవెన్స్ లు ఉంటాయి. మంత్రులు లక్షల రూపాయల్లో వాటిని తీసుకుంటారు. ఇక క్యాంపు కార్యాలయాలకు తమ అభిరుచులకు తగ్గట్టు ఫర్నిచర్ వాడుతుంటారు. కానీ వాటన్నింటికీ దూరంగా ఉండాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో తనకు క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేస్తే.. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఫర్నిచర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ పవన్ తనకు అవసరం లేదని తేల్చి చెప్పారు. తన సొంత ఫర్నిచర్ ను తెప్పించుకున్నారు.శాసనసభ సమావేశాలకు మూడు నాలుగు రోజులు పాటు హాజరైతే 40 వేల వరకు వేతనం వస్తుందని అధికారులు చెప్పగా.. అందుకు సంబంధించి బిల్లులు పెట్టవద్దని కూడా ఆదేశాలు ఇచ్చారు పవన్. ఈ విషయాలను పిఠాపురంలో జరిగిన పింఛన్ల పంపిణీ సభలో పవన్ వెల్లడించారు.

పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని.. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘శాఖలపైఅధ్యయనానికి కొంత సమయం తీసుకున్నా.తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నా.అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదు.రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి. గత ప్రభుత్వంలో పంచాయితీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు. వందల కోట్ల రూపాయలతో రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అవే నిధులు ఉపయోగిస్తే కొంత అభివృద్ధి జరిగేది. నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు. పర్యావరణ శాఖను బలోపేతం చేస్తాం. పంచాయతీరాజ్ శాఖలో నిధులు లేవు. ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయో తెలియడం లేదు. ఒక్కో విభాగంలో తవ్వే కొద్ది లోపలికి వెళ్తూనే ఉంది. ఇవన్నీ సరిచేయాలి. శాఖ అప్పుల్లో ఉన్నప్పుడు నాలాంటి వాడు జీతం తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకే జీతం వదిలేస్తున్నాను’ అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

పవన్ చాలా పారదర్శకంగా వెళ్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నికైనా.. అనుభవం ఉన్న నేతగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పవన్ భావిస్తున్నారు. ముందు తనకు తాను సంస్కరించుకుంటున్నారు. తన శాఖలపై పట్టు పెంచుకుంటున్నారు. వీలైనంతవరకు సమస్యలకు పరిష్కార మార్గం చూపించాలి అనుకుంటున్నారు. ఈ క్రమంలోదర్పానికి దూరంగా ఉంటున్నారు. ఆర్భాటాలను కూడా వీలైనంత త్వరగా తగ్గించుకుంటున్నారు.