Chandrababu: తెలుగుదేశం పార్టీకి ఇది మంచి సమయం. ఏపీలో కూటమిగా వెళ్లినా.. సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు తగ్గట్టు మెజారిటీ సాధించారు. 16 లోక్సభ స్థానాలను దక్కించుకున్నారు. కేంద్రంలో కీలకంగా మారారు. కింగ్ మేకర్ గా అవతరించారు. ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురైనా.. కేంద్ర పెద్దలు ప్రాధాన్యం ఇవ్వక తప్పడం లేదు. దీంతో పార్టీలో ఒక రకమైన జోష్ కనిపిస్తోంది. ఇదే జోష్ తో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ అచేతన అవస్థను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. గతంలో టిడిపి స్థానాన్ని బిఆర్ఎస్ భర్తీ చేయగా
.. తిరిగి ఆ స్థానాన్ని పొందడానికి చంద్రబాబు పావులు కదపనున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రధాన ప్రతిపక్ష పాత్రను బిజెపి పోషిస్తోంది. అసెంబ్లీ సీట్ల పరంగా బిఆర్ఎస్ ప్రతిపక్ష హోదా దక్కినా.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో చతికిల పడింది. ఒక్క సీటు కూడా దక్కలేదు. ఆ పార్టీ పతనం రోజురోజుకూ పెరుగుతోంది. ఆ పార్టీ ఉనికి ప్రమాదంలో పడింది. దీంతో ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించుకునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లి టిఆర్ఎస్ ను స్థాపించారు. సుదీర్ఘకాలం ఉద్యమం చేసి తెలంగాణ సాధించారు. అదే తెలంగాణకు సీఎం అయ్యారు. అప్పటివరకు ఉద్యమాన్ని నమ్ముకున్న కేసీఆర్.. బంగారు తెలంగాణ సాధనలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలను తన వైపు తిప్పుకున్నారు. పార్టీ క్యాడర్ను ఆకర్షించారు. వరుసగా రెండుసార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. కానీ ప్రజలు కేసీఆర్ చర్యలను తిరస్కరించడం ప్రారంభించారు. దీంతో కేసీఆర్ను నమ్ముకుని వెళ్లిన టిడిపి పాత నాయకత్వం, క్యాడర్ ఆందోళనతో ఉంది. వారందరూ టిడిపి గూటికి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏపీలో కూటమి సక్సెస్ అయ్యింది. టిడిపి, బిజెపి, జనసేన కలయిక వర్కౌట్ అయ్యింది. ఆ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇదే పొత్తు ఫార్ములాను తెలంగాణలోనూ కొనసాగిస్తే తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్నది చంద్రబాబు ఆలోచన. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు అక్కడ టిడిపి బలోపేతం పై ఫోకస్ పెట్టారు. కాసాని జ్ఞానేశ్వర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. కానీ టిడిపి పోటీ చేయలేకపోవడంతో అసంతృప్తికి గురైన జ్ఞానేశ్వర్ పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు ఏపీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ టిడిపి పై చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు. ముందుగా ఖాళీగా ఉన్న టీటిడిపి అధ్యక్ష పదవిని భర్తీ చేయనున్నారు. ఇందుకుగాను సమర్థవంతమైన నేత కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే దీనిపై ఒక క్లారిటీ రానుంది.