AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్ సందడి ప్రారంభమైంది. నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. రెండు రోజుల్లో రెండో విడత జాబితాను ప్రకటించనున్నారు. పార్టీలో సీనియర్లకు సముచిత స్థానం కల్పిస్తూ ఈసారి జాబితా ఉంటుందని తెలుస్తోంది. 21 కార్పొరేషన్లతో తొలి విడత జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 99 మంది డైరెక్టర్లను నియమించారు. తాజాగా టీటీడీ ట్రస్ట్ బోర్డును సైతం ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో రెండో జాబితా ప్రకటనకు సిద్ధపడుతున్నారు. ఈసారి మూడు పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మొదటి జాబితాలో జనసేనకు మూడు కార్పొరేషన్లు, బిజెపికి ఒకటి కేటాయించారు. మిగతా 17 మాత్రం టిడిపి నేతలతో భర్తీ చేశారు. అయితే గతం కంటే ఎక్కువ ఇవ్వాలని జనసేనతో పాటుబిజెపి పట్టుబడుతోంది.మరోవైపు టీడీపీ సీనియర్లు సైతం అసంతృప్తితో ఉన్నారు.ఈసారి తమ పేర్లు తప్పకుండా వస్తాయని భావిస్తున్నారు.లేకుంటే మాత్రం తీవ్ర మనస్థాపానికి గురయ్యే అవకాశం ఉంది.తొలి జాబితా ప్రకటించే సమయంలోనే తీవ్ర అసంతృప్తికి గురయ్యారు టిడిపి సీనియర్లు.ఈసారి తమకు ఎలాగైనా న్యాయం చేస్తారని భావిస్తున్నారు. తమకు తప్పకుండా పదవులు లభిస్తాయని అత్యంత విశ్వాసంతో ఉన్నారు.
* మాజీ మంత్రికి పదవి ఖాయమా
మాజీ మంత్రి దేవినేని ఉమా ఈసారి తనకు పదవి ఖాయమని నమ్మకంగా ఉన్నారు. వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కోసం మైలవరం టికెట్ వదులుకున్నారు ఉమా. నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఆర్టీసీ చైర్మన్ పదవి ఉమాకు ఇస్తారని చాలా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇప్పటికే ఆయన పేరు ఖరారు అయిందని టాక్ నడిచింది. కానీ అనూహ్యంగా ఆ పదవి వేరే నేతకు దక్కింది. దీంతో ఉమా తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. టిడిపి పెద్దల వద్ద తన అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు సర్ది చెప్పడంతో ఊరుకున్నారు. అయితే నామినేటెడ్ పదవి కంటే ఎమ్మెల్సీ, రాజ్యసభ సీటును ఉమా ఆశిస్తున్నట్లు మరో ప్రచారం ఉంది.
* జీవి రెడ్డికి చాన్స్ వచ్చేనా?
టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరారు జీవి రెడ్డి.రాయలసీమ జిల్లాలకు చెందిన జీవీ రెడ్డికి వైసీపీ నుంచి ఆహ్వానం ఉంది.కానీ అనూహ్యంగా టిడిపిలో చేరి ఆశ్చర్యపరిచారు.మంచి వాగ్దాటి కలిగిన నేతగా గుర్తింపు పొందిన జీవి రెడ్డిని అధికార ప్రతినిధిగా నియమించింది తెలుగుదేశం పార్టీ. గత ఐదేళ్ల కాలంలో గట్టిగానే తన వాయిస్ను వినిపించారు జీవి రెడ్డి. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆశించారు. కానీ తొలి జాబితాలో జీవి రెడ్డికి చోటు దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. టిడిపి అనుకూల మీడియాలోనే తన ఆవేదనను వ్యక్తపరిచారు. రెండో జాబితాలో తన పేరు ప్రకటిస్తారని విశ్వాసంగా ఉన్నారు.
* పట్టాభి పరిస్థితి ఏంటి
తెలుగుదేశం పార్టీలో బలమైన వాయిస్ ఉన్న నేత పట్టాభి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించారు. ఒకటి రెండు సార్లు వైసీపీ శ్రేణులు పట్టాభిపై దాడి చేశాయి కూడా. అయితే పట్టాభిని వల్లభనేని వంశీ పై పోటీకి దించుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలోకి రావడంతో ఆయనకు టికెట్ దక్కింది. మిగతా నియోజకవర్గాల్లో సర్దుబాటు చేస్తారని టాక్ నడిచింది. అయితే అటువంటిదేమీ జరగలేదు.తొలి విడత నామినేటెడ్ జాబితాలో కూడా పట్టాభి పేరు లేదు.దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు.పెద్దలు సముదాయించడంతో వెనక్కి తగ్గారు.అయితే ఈ ముగ్గురు పేర్లు ఈసారి రెండో జాబితాలో ఉంటాయని తెలుస్తోంది.మరి ఉండకపోతే ఎటువంటి చర్యలకు వారు దిగుతారో చూడాలి.