Cm chandhrababu: ఏపీలో పాలనను సజావుగా ముందుకు తీసుకెళ్లడంలో దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ తో పాటు ఇతర మంత్రులు సైతం తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉన్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రజా దర్బారులు నిర్వహిస్తూ నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వాటికి పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ఇటీవల సంఘ సేవకురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారు. నేరుగా దొరకకపోయేసరికి చంద్రబాబుకు ట్వీట్ చేశారు. దీంతో గంటల వ్యవధిలోనే చంద్రబాబు స్పందించారు. రేపు సచివాలయంలో కలిసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ ఒక్క ఘటన చాలు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో ఆలోచిస్తుందో అర్థం అవుతోంది. కేవలం ప్రజలతో మమేకం అయి పనిచేయడం ద్వారా కొన్ని సమస్యలకు మార్గం చూపాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ప్రజాదర్బార్లు నిర్వహిస్తున్నారు. వారంలో ఒకరోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వెళుతున్నారు. ఇంకోవైపు పింఛన్ల పంపిణీకి నేరుగా రంగంలోకి దిగుతున్నారు. అయితే ఎక్కడ ప్రజా జీవనానికి ఇబ్బంది పెట్టడం లేదు. భారీ స్థాయిలో జన సమీకరణ కూడా చేయడం లేదు. తాను ప్రజాదర్బార్ నిర్వహించడమే కాదు మంత్రులతో పాటు కీలక నేతలకు ఆ బాధ్యతలు అప్పగించారు. జిల్లాల పర్యటన సమయంలో సైతం పెద్దగా హడావిడి చేయడం లేదు. పరదాలు కట్టించడం లేదు. సామాన్య ప్రజలను కలిసేందుకు సైతం మొగ్గు చూపుతున్నారు. అటు పవన్ సైతం ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో పార్టీ బాధ్యులకు కూడా బాధ్యతలు అప్పగిస్తున్నారు.
* నిజంగా గుణపాఠమే
గత ప్రభుత్వాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు. తెలంగాణలో కెసిఆర్, ఏపీలో జగన్ అనుసరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. తమను గెలిపించిన ప్రజలను కలుసుకునేందుకు కూడా వారు పెద్దగా ఇష్టపడలేదు. తెలంగాణలో ప్రగతి భవన్ కు తాళాలు పడ్డాయి. ఏపీలో తాడేపల్లి ప్యాలెస్ సైతం సామాన్యులకు ఎంట్రీ లేకుండా పోయింది. చివరకు మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సైతం చాన్స్ ఇవ్వలేదు. అప్పట్లో సీఎంలను కలవాలంటే ఒక ప్రహసనమే. చివరకు ప్రజా సమస్యలపై ముందుండే వామపక్ష నేతలను సైతం నిలువరించేవారు. కానీ ఇప్పుడు అదే కామ్రేడ్లను క్షమించండి అంటూ మంత్రి లోకేష్ కోరారు అంటే ఏ స్థాయిలో పనిచేస్తున్నారో అర్థం అవుతోంది.
*:జగన్ వైఫల్యం అదే
ఏపీలో జగన్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం ప్రజలతో మమేకం కాకపోవడమే. జగన్ను నేరుగా కలిసేందుకు ఎవరికీ చాన్స్ లేదు. కనీసం నియోజకవర్గాల సమస్యలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యేలు వెళితే సీఎంఓ అడ్డగోడగా ఉండేది. ఏదైనా చెప్పుకోవాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డికి కలవాల్సిందే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు, జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ అందుబాటులో ఉంటున్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యను వింటున్నారు. పార్టీ శ్రేణుల నుంచి సైతం వినతులు స్వీకరిస్తున్నారు.
* ప్రజల్లో సానుకూలత కోసమే
ప్రజల్లో ఒక రకమైన సానుకూలత సాధించడానికి దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ఇంతవరకు పింఛన్ల పెంపు తప్ప ఏ పథకం అమలు చేయలేదు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకుంటుంది ప్రభుత్వం. అందుకే ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజల మధ్య ఉండాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా వారు తమ కోసమే పని చేస్తున్నారని ప్రజలు కూడా ఒక ఆలోచనకు వస్తున్నారు. ఇది కచ్చితంగా సత్ఫలితం ఇస్తుందని అంచనా వేస్తున్నారు.