Chandrababu serious on those MLAs: ఓ ముగ్గురు టిడిపి నేతలపై చంద్రబాబు( CM Chandrababu) నివేదిక కోరారా? వారిపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారా? చర్యలకు ఉపక్రమించనున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని సర్వేల్లో స్పష్టం అవుతుంది. అటు చంద్రబాబు సైతం చాలామందిని హెచ్చరించారు. అయినా వారి పనితీరులో మార్పు రావడం లేదు. ఒకవైపు ప్రభుత్వ పెద్దలు కష్టపడుతున్నారని ప్రజల్లో ఒక సానుకూలత ఉంది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపై మాత్రం అందుకు పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఈ తరుణంలో నిన్ననే మూడు ఘటనలు జరిగాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ మూడు వార్తలు చెవిలో పడ్డాయి. దీంతో తక్షణం నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సదరు నేతల తప్పు అని తేలితే మాత్రం చర్యలకు ఉపక్రమించే అవకాశం కనిపిస్తోంది.
ఢిల్లీ వెళ్తున్న సమయంలో..
ప్రస్తుతం మంత్రి లోకేష్( Minister Lokesh) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. చంద్రబాబు సైతం ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ తరుణంలో ముగ్గురు ఎమ్మెల్యేలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నసీర్( MLA Nasir ) గడిచిన కొద్ది రోజులుగా వార్తల్లోకి ఎక్కారు. ఓ మహిళతో వివాహేతర సంబంధం సాధించి.. ఆ విషయాన్ని బయట పెట్టిందని ఆగ్రహంతో చంపేస్తానంటూ బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. బాధిత మహిళ సైతం నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను బెదిరిస్తున్న వీడియోలను సైతం ఆమె సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఒక్కసారిగా అధికార పార్టీ ఎమ్మెల్యే పై పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది.
Also Read: ఎన్డీఏకు జగన్ మద్దతు.. బిజెపి కీలక నేత ఫోన్!
మరోవైపు టీడీపీ సీనియర్ నేత, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై కూడా ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. తన నియోజకవర్గ పరిధిలోని ఓ కేజీబీవీ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగికి ఫోన్ చేసి.. వాట్సాప్ వీడియో కాల్ చేయాలని కోరినట్లు సదరు బాధితురాలు చెబుతోంది. ఆ విషయాన్ని ఆమె ఆదివారం బయటపెట్టింది. తన మాదిరిగానే రవి చేతిలో చాలామంది మహిళలు ఇబ్బందులు పడ్డారని వాపోయింది.
మరోవైపు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్( MLA Venkateswara Prasad ) వివాదాల్లో చిక్కుకుంటున్నారు. పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో విభేదాలు ఉన్నాయి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించి ఆయన చేసిన ఆడియో సంభాషణ ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టిడిపి అగ్ర నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అనుమానాలు ఉన్నాయి. వాటిని తావిచ్చేలా ఎమ్మెల్యే ప్రసాద్ మాటలు ఉన్నాయి. అందుకే ఈ ముగ్గురు నేతల వ్యవహార శైలి పై నివేదిక కోరినట్లు సమాచారం. మరి చంద్రబాబు ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారో చూడాలి.