AP Cabinet Expansion: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. క్యాబినెట్లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. దానిని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుతో భర్తీ చేస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సిద్ధపడుతున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. అయితే మంత్రిగా ఒక్క నాగబాబు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయడం లేదని.. ఆయనతో పాటు మరో నేత కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు ఒక ముగ్గురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని.. ఖాళీగా ఉన్న ఆ మంత్రి పదవి నాగబాబుకు ఇవ్వగా.. మరో ఇద్దరు మంత్రులను రాజీనామా చేయించి వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తారని ప్రచారం నడుస్తోంది. అయితే ఏడు నెలల కిందటే మంత్రులుగా బాధ్యత స్వీకరించారు. అప్పుడే తొలగిస్తారు అనడం నమ్మశక్యంగా లేదు.
* మంత్రివర్గ విస్తరణకు కసరత్తు
ఈ ఎన్నికల్లో కూటమి అనూహ్య విజయం సాధించింది. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం కొలువుదీరింది. మూడు పార్టీలకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. జనసేనకు మూడు మంత్రి పదవులు ఇవ్వగా బిజెపికి ఒక మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. 24 మంది మంత్రులతో కొలువుదీరింది చంద్రబాబు సర్కార్. అయితే రాజ్యసభ సమీకరణలో భాగంగా మెగా బ్రదర్ నాగబాబుకు అవకాశం లభించలేదు. దీంతో ఆయనను క్యాబినెట్ లోకి తీసుకుంటానని చంద్రబాబు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు జనవరి 8న చంద్రబాబు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టు కసరత్తులు కూడా జరుపుతున్నట్లు సమాచారం.
* ఇద్దరు మంత్రులు ఔట్
ఈసారి కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పదిమందికి మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. పదవులు ఇచ్చినప్పుడే శాఖల ప్రగతి మెరుగుపరుచుకోవాలని.. పనితీరు విషయంలో కొలమానంగా భావిస్తానని చంద్రబాబు తేల్చి చెప్పారు. అయితే చంద్రబాబు నుంచి హెచ్చరికలు వచ్చినా కొందరు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. మంత్రులుగా పనితీరుతో పాటు జిల్లాలో వారి ముద్ర కనిపించడం లేదు. అటువంటి వారి విషయంలో చంద్రబాబు వేరే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మంత్రి వర్గం నుంచి ఇద్దరి ఉద్వాసన తప్పదని ప్రచారం నడుస్తోంది.ప్రధానంగా ఉత్తరాంధ్ర కు చెందిన ఒక జూనియర్, గోదావరి జిల్లాలకు చెందిన మరో నేతను తొలగిస్తారని టాక్ నడుస్తోంది. తొలగించిన వారి ప్లేసులో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు ఛాన్స్ ఇస్తారని సమాచారం. మరో పదవి ఎవరికి ఇస్తారా? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.