Chandrababu: రేపు పవన్ తో చంద్రబాబు కీలక భేటీ వెనుక కథేంటి?

కౌంటింగ్ లో అధికార వైసిపి గందరగోళానికి దిగే అవకాశం ఉందని.. అందుకే అప్రమత్తం చర్యల్లో భాగంగా పవన్ తో చంద్రబాబు భేటీ అవుతారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియపై టిడిపి ఏజెంట్లకు శిక్షణ ఇస్తోంది.

Written By: Dharma, Updated On : May 30, 2024 12:51 pm

Chandrababu

Follow us on

Chandrababu: ఏపీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సమీపిస్తోంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు విదేశాలకు వెళ్లిన పార్టీల అధినేతలు ఒక్కొక్కరు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. చంద్రబాబు నిన్న చేరుకున్నారు. ఈరోజు అమరావతి రానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రేపు జనసేన అధినేత పవన్ చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. నేరుగా ఆయన ఇంటికి వెళ్లి కీలక అంశాలు పై చర్చిస్తారని సమాచారం. బిజెపి నేతలు సైతం పాల్గొనే అవకాశం ఉంది.

కౌంటింగ్ లో అధికార వైసిపి గందరగోళానికి దిగే అవకాశం ఉందని.. అందుకే అప్రమత్తం చర్యల్లో భాగంగా పవన్ తో చంద్రబాబు భేటీ అవుతారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియపై టిడిపి ఏజెంట్లకు శిక్షణ ఇస్తోంది. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఈసీ తో పాటు డీజీపీకి చంద్రబాబు లేఖ రాయనున్నారు. మరోవైపు విజయం పై చంద్రబాబు ధీమాతో ఉన్నారు. కౌంటింగ్ తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి తీసుకోవాల్సిన అంశాలపై సైతం పవన్ తో చంద్రబాబు చర్చించనున్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి వైసీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఆర్వో సీలు, సంతకాల విషయంలో మినహాయింపు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఈసీని కోరింది. దీనిపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ మినహాయింపు ఇస్తూ లిఖితపూర్వకంగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై వైసీపీ అభ్యంతరాలు చెబుతోంది. ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఉండడంతో.. వారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడవని వైసిపి ఒక నిర్ణయానికి వచ్చింది. అందుకే వారి ఓట్లు చెల్లుబాటు కాకుండా చూడాలని చూస్తోంది. దీనిపైన పవన్ తో పాటు బిజెపి నేతలతో చంద్రబాబు ప్రధానంగా చర్చించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఏ చిన్న లోపం జరగకుండా చూడాలని.. అవసరమైతే కేంద్రంతో మాట్లాడాలని కూడా చంద్రబాబు నిర్ణయించారని సమాచారం.

అయితే ఒక్క కౌంటింగ్ గురించే కాదు.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయంలో అనుసరించాల్సిన వ్యూహం పై కూడా చంద్రబాబు పవన్ తో చర్చించే అవకాశం ఉంది. ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది. అర్ధరాత్రి వరకు ఓటర్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు దృష్టి పెట్టారని తెలుస్తోంది. కౌంటింగ్ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమవుతుంది. దానిపై ఇద్దరు నేతలు ఒక ప్రాథమిక అవగాహనకు వస్తారని తెలుస్తోంది.