Welfare schemes : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తోంది. జూన్ 12న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. అటు తరువాత మంత్రులు కొలువుదీరారు. ఈ ఎన్నికల్లో చాలావరకు హామీలు ఇచ్చారు చంద్రబాబు. అందుకు తగ్గట్టుగానే కీలక ఐదు హామీలకు సంబంధించి ఫైళ్లపై సంతకాలు చేశారు. మూడు వేల రూపాయలు ఉన్న పింఛన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచారు. ముందుగానే హామీ ఇచ్చినట్టు ఏప్రిల్ నెల నుంచి బకాయిలు అందించారు. అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసేందుకు యోచిస్తున్నారు. అయితే కీలకమైన అన్నదాత సుఖీభవ, అమ్మఒడి వంటి పథకాలు ప్రారంభానికి నోచుకోలేదు. ఎప్పుడు అమలు చేస్తారో కూడా తెలియడం లేదు. కనీసం దాని గురించి సన్నాహాలు కూడా లేవు. ఈ ఏడాది జూన్ లో కూటమి అధికారంలోకి వచ్చింది. అదే నెలలో విద్యా సంవత్సరం ప్రారంభమైంది. జూలైలో ఖరీఫ్ మొదలైంది. కానీ పిల్లల చదువుకు సాయం లేదు. ఇటు అన్నదాత సుఖీభవ కింద రైతులకు సాయం అందించలేదు. అసలు ఈ ఆర్థిక సంవత్సరానికి అందించే ఉద్దేశం ఉందా? లేదా? అన్నది తెలియాలి. మంత్రులు మాత్రం అడపాదడపా ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దీనిపై ప్రజల నుంచి విమర్శలు ప్రారంభమవుతున్నాయి.ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతున్నాయి ఈ పరిణామాలు.
* విజయవంతంగా అమ్మ ఒడి
2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో నవరత్నాలు కింద హామీలు ఇచ్చారు. అందులో ఒకటి అమ్మ ఒడి. ఇలా అధికారంలోకి వచ్చారో లేదో.. తొలి ఏడాది అమ్మ ఒడి అమలు చేశారు. ప్రతి కుటుంబంలో చదువుకుంటున్న పిల్లల్లో ఒకరికి అమ్మ ఒడిని వర్తింపజేశారు. తొలి ఏడాది 15 వేల రూపాయలు అందించారు. అందులో 1000 రూపాయలు ను పాఠశాల నిర్వహణకు గాను కోత విధించారు. అటు తరువాత వరుసగా మూడేళ్ల పాటు అమ్మ ఒడిని అమలు చేయగలిగారు. అయితే ఈసారి 13000 లబ్ధిదారుల ఖాతాలో.. రెండు వేల రూపాయలను మాత్రం పాఠశాల నిర్వహణ ఖర్చులకు గాను తీసుకున్నారు. అయితే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది చదువుకు సాయం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుతున్నా ఇంతవరకు అమలు చేయలేదు.
* రైతు భరోసా పేరు మార్చినా
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పేరును మార్చారు. అన్నదాత సుఖీభవ గా మార్చి దాని వెబ్సైట్ను సైతం మార్చేశారు. దీంతో ఈ ఖరీఫ్ నుంచే అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 అందుతుందని ఆశించారు. కానీ ఖరీఫ్ దాటిపోతోంది. ఇంతవరకు అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టూ లేదు. కనీసం సన్నాహాలు కూడా చేయలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో పని లేకుండా కేంద్రం పిఎం కిసాన్ సామాన్ నిధిని కొనసాగిస్తుంది. రేపు రైతుల ఖాతాలో కేంద్ర సాయం కింద రెండు వేల రూపాయలు జమ కానుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇస్తామన్న నగదు సాయం మాత్రం అందకుండా పోతుంది. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అన్నింటికీ మించి ఈ రెండు పథకాలు కీలకంగా ఉన్నాయి. ప్రజల్లో మాత్రం ఆ స్థాయిలో సంతృప్తి కనిపించడం లేదు. మిగతా పథకాల పేరు చెప్పి కాలం గడిపేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.