Chandrababu: ఏపీలో పొత్తులకు ముందడుగు పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టిడిపి,జనసేన మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. మరోవైపు బిజెపి సైతం కూటమిలోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తీవ్ర తర్జనభజన తర్వాత కూటమితో ముందుకు వెళ్లడమే ఉత్తమమని బిజెపి అగ్రనేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 400 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా బిజెపి పావులు కదుపుతోంది. వివిధ కారణాలతో దూరమైన స్నేహితులను దగ్గరకు తీసుకుంటోంది. ఏపీలో టిడిపి,జనసేన మద్దతుతో ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని ప్లాన్ చేస్తోంది. అటు చంద్రబాబు సైతం బిజెపి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వారు అడిగిన సీట్లకు దగ్గరగా త్యాగం చేసేందుకు చంద్రబాబు సిద్ధపడినట్లు సమాచారం.
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్యలాంటివి. అందుకే చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. వైసీపీని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందుకే పొత్తులు కుదుర్చుకొని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలకు 50 వరకు అసెంబ్లీ స్థానాలు, 10 వరకు ఎంపీ సీట్లు విడిచి పెట్టాలని దాదాపు డిసైడ్ అయ్యారు. జనసేన ముందుగా 40 అసెంబ్లీ సీట్లు కోరినా.. బిజెపికి సర్దుబాటు చేయాల్సి ఉండడంతో 25 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అటు బిజెపి సైతం తమకు 25 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలను కోరుతోంది. చంద్రబాబు మాత్రం ఆరు ఎంపీ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా వైసిపి పెద్ద ఎత్తున అభ్యర్థులను ప్రకటించింది.అందుకే మూడు పార్టీల పొత్తులో భాగంగా పోటీ చేసే నియోజకవర్గాల ప్రకటన ఒకేసారి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపికి కేటాయించే స్థానాలపై ఇప్పటికే స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. అరకు, విశాఖ, ఏలూరు లేదా రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బిజెపికి ఇచ్చేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది అటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అరకు, విశాఖ ఉత్తరం, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రాజమండ్రి సిటీ, ఉంగటూరు / తాడేపల్లిగూడెం, కైకలూరు, విజయవాడ సెంట్రల్, శ్రీకాళహస్తి, మదనపల్లె, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్, ఒంగోలు, ప్రత్తిపాడు నియోజకవర్గాలు బిజెపికి కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం బిజెపి కీలక నాయకులు ఉన్నచోట సీట్ల సర్దుబాటు ప్రక్రియ జరుగుతున్నట్లు సమాచారం. అయితే దాదాపు 40 అసెంబ్లీ సీట్లు, 10 పార్లమెంట్ స్థానాలు వదులుకోవడం ద్వారా టిడిపి నేతలు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆయా నియోజకవర్గ నేతలను చంద్రబాబు పిలిపించి మాట్లాడుతున్నారు. ప్రత్యామ్నాయ అవకాశాలపై హామీ ఇస్తున్నారు. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.